BC Reservations: ఎమ్మెల్సీ కవిత ఉద్యమానికి, జూలై 17 రైల్ రోకోకు ఆర్ కృష్ణయ్య సంపూర్ణ మద్ధతు
ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ ఉద్యమానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. కవిత ఆదివారం నాడు బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న బీసీ ఉద్యమానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ సంయుక్తంగా జూలై 17న తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమంతో సహా ప్రతీ కార్యక్రమానికి తాము అండగా ఉంటామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీలంతా ఎమ్మెల్సీ కవిత ఉద్యమంలో భాగస్వాములు కావాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు.
విద్యానగర్ లోని ఆర్ కృష్ణయ్య నివాసంలో ఆదివారం ఆయనతో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కల్పించడానికి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడానికి చేపతుతున్న రైల్ రోకోకు మద్ధతివ్వాలని కవిత కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ... ఆర్ కృష్ణయ్య అనేక ప్రజాస్వామిక, సామాజిక ఉద్యమాలను నడిపించారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) కోసం పోరాటం చేసిన దానికి ఫలితంగా 2 బిల్లులను అసెంబ్లీ ఆమోదించిందని ఆమె గుర్తు చేశారు.
రాజ్యాంగంలోని 243(డీ) ప్రకారం ఒక జీవో ఇచ్చి 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. పైగా ఆ నెపాన్ని మొత్తం రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వంపై తోసేసి రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికల్లోకి వెళ్లే ప్లాన్ చేయడం దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల ప్రేమను మాటల్లో వరకే పరిమితం చేసింది. అవసరమైన చర్యలను చేతల్లో చూపించడం లేదు.
తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని లీకులు ఇస్తున్నారు. కనుక ప్రజా వ్యతిరేక విధానాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే మార్గంగా కనిపిస్తున్నాయి. అందుకే రైల్ రోకో చేపడుతున్నాం. ఔర్ ఏక్ ధక్కా... బీసీ బిల్లు పక్కా...’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
బీసీ ఉద్యమ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.... ఎమ్మెల్సీ కవిత బీసీలకు అండగా నిలచి ఉద్యమం చేస్తున్నారు. కనుక బీసీలంతా కవిత చేపట్టనున్న ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వాములై మద్ధతగా నిలవాలి. తరతరలాలుగా అన్యాయం జరుగుతున్న బీసీల కోసం కవిత పోరాటం అభినందనీయం. ఎమ్మెల్సీ కవిత ఉద్యమం ఎవరి కోసం చేస్తున్నారు ? మన కోసం కనుక ఆమె చేస్తున్న ఉద్యమానికి మనమంతా అండగా ఉండాలి. ఈ ఉద్యమాన్ని బీసీలు భుజాన ఎత్తుకోకపోతే రేపు మనకు భవిష్యత్తు లేదు” అన్నారు.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లీస్తోందని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ది ఉంటే జీవో జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు తీరని ద్రోహం చేసినట్లు అన్నారు. ఇలాగ పోరాటం చేయకపోతే భవిష్యత్తులో బీసీల రిజర్వేషన్లు తగ్గిపోయే అవకాశం సైతం ఉందని హెచ్చరించారు.
రిజర్వేషన్లు పెంచకపోతే బీసీలు తెలంగాణ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, స్థానిక ఎన్నికలు జరపాలని, లేదంటే పెద్ద యుద్ధమే జరుగుతుందని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.






















