Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో స్పెషల్ మెను- విద్యార్థుల ఆందోళన
తెలంగాణ యూనివర్సిటీ క్యాoటీన్‌లో కప్ప ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఫుడ్‌లో కప్ప వచ్చిందని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో వంట సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు వార్డెన్.
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీ మహిళ వసతి గృహంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం టిఫిన్‌లో కప్ప రావడంతో కంగారుపడిపోయారు. కాసేపటికి తేరుకొని నిరసన బాట పట్టారు. విద్యార్థినిలు హాస్టల్ నుంచి అడ్మిన్ బిల్డింగ్ వరకు ర్యాలీగా వచ్చి విసి చాంబర్ ఎదుట ఆందోళన చేశారు. వెంటనే సంబంధిత వంట సిబ్బంది, వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు .
500 మందికి కేవలం ఒకే హాస్టల్ ఉండటంతో అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నామన్నారు విద్యార్థినులు. ఉదయం టిఫిన్ 11 గంటల తర్వాత టిఫిన్ అందిస్తున్నారన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. వెంటనే వీసీ, రిజిస్ట్రార్ హాస్టల్‌ను సందర్శించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు
విద్యార్థుల ఆందోళనలతో వార్డెన్ దిగొచ్చారు. వారితో చర్చించి ఇకపై ఇలాంటి దుర్ఘటనలు రిపీట్ కావని హామీ ఇచ్చారు. మిగతా సమస్యలు వీసీతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. టిఫిన్‌లో కప్ప రావడంపై సీరియస్ అయ్యారు. వంట సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.
ఈ మధ్యకాలంలో నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆలుగడ్డ కూరలో కప్పలు వచ్చేయాని విద్యార్థులకు ఆరోపించారు. ఓ విద్యార్థి తన ప్లేట్లో కప్పను చూసి ఖంగుతిన్నాడు. దీంతో మిగతా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే మెస్ కాంట్రాక్టర్ తన పలుకుబడిన ఉపయోగించి విషయం బయటకు రాకుండా విద్యార్థులను కట్టడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా ఒక ఫొటో బయటకు రావడంతో అసలు విషయం తెలిసింది. బాసర ట్రిపుల్ ఐటీలో ఏడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం మూడు మెస్లున్నాయి. ఇవి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. మూడు మెస్‌ల నిర్వాహకులు-అధికారులు కలిసిపోయారు. కొన్నాళ్లుగా విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆందోళన చేస్తే అడ్మిషన్ తొలగిస్తాం
భోజనాల్లో పురుగులు నిత్యకృత్యమైందని తాజాగా కప్పను రావడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. మీడియాకు క్యాంపస్‌లోకి అనుమతి ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డాయి.
తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రిక్వస్ట్ చేస్తున్నారు విద్యార్థులు. యూనివర్శీటిల్లో ఆహార సమస్యతోపాటు ఇతర సమస్యలు కూడా ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలని వేడుకుంటున్నారు. చిన్న విషయాలని ఇలాంటివి వదిలేయడంతో తప్పు చేస్తున్న వారిలో భయంపోతుందంటున్నారు. ఆందోళనలు చేసినప్పుడు స్పందించి మిగతా టైంలో పట్టించుకోకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.