Adilabad Latest News:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన- రైతులకు భరోసా, విద్యార్థులకు స్ఫూర్తి పాఠాలు
Adilabad Latest News:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. అమ్మవారిని దర్శించుకొని విద్యార్థులతో ముచ్చటించి రైతులకు భరోసా కల్పించారు.

Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. బాసర సరస్వతి ఆలయాన్ని సందర్శించారు. త్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముచ్చటించారు. చదువుతో పాటు ఆటల్లో రాణించాలని సూచించారు. నిర్మల్‌లో వరదలకు నష్టపోయిన రైతులను పరామర్శించి పరిహారం వస్తుందని భరోసా ఇచ్చారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేసి, ఆశీర్వదించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ దండే విఠల్, తదితరులు ఉన్నారు.

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బాసర ఆలయ అభివృద్ధి: మంత్రి జూపల్లి కృష్ణారావు
దక్షిణ భారతదేశంలో ఒకటైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూ.190 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారని, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఆపై బాసర ఆలయ అభివృద్ధిపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఆలయ ఆదాయ, వ్యయాలు, యేటా వచ్చే భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం తదితర అంశాలపై చర్చించారు. ఆదాయ, వ్యయాలను రోజువారీగా కంప్యూటర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఆలయ నిర్వహణపై కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
గోదావరి పుష్కరాలకు సన్నద్ధం కావాలి
2027లో వచ్చే గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి ముచ్చట
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ట్రిపుల్ ఐటీ బాసర అభివృద్ధితోపాటు ఇక్కడి విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ట్రిపుల్ ఐటీని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు మంత్రి. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని విద్యార్థుల్లో ప్రేరణ కలిగించారు. నేటి యువత జీవితంలో ఫెయిల్ అయ్యామనో, సబ్జెక్ట్ తప్పామనో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, జీవితంలో ఒడిదొడుకులు సహజమని, వాటిని అధిగమించి విజయం సాధించాలని మోటివేట్ చేశారు
సంస్కృతి అంటే కేవలం ఆటపాటలు, నాట్యం, సంగీతం, సాహిత్యం, కవిత్వం, భాషకే పరిమితం కాదని, సంస్కృతి అంటే మన అస్తిత్వం. ప్రజల జీవన విధానయని అన్నారు. అయితే ప్రజల జీవన విధానం ధ్వంసమైందని, ప్రజలో ఆలోచన ధోరణి మారిందని, ప్రజల జీవన విధానం గతి తప్పడం వల్లే అనేక పెడ ధోరణులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లు మారి అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు.
మొబైల్ ఫోన్లలో మునిగితేలుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి. గతంలో ఎంతో వేడుకగా , ఉత్సాహంగా పండగలను జరుపుకునేవారు. మొబైల్ ఫోన్స్ లోనే వినోదాన్ని పొందుతూ… ఆట పాటలను మరిచిపోతున్నారని అన్నారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, నృత్యం, సంగీతం, కళల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. బాసర ట్రిపుల్ ఐటికి సాంస్కృతిక శాఖ తరపున కోటి రూపాయలు మంజూరు చేస్తానని చెప్పారు.

నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆస్ట్రానమీ ల్యాబ్ మంత్రి సందర్శించారు. ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన పరికరాలు, నమూనాలను మంత్రి, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశ్నలతో పరీక్షిస్తూ, వారు చూపిన పరిజ్ఞానాన్ని అభినందించారు. ఇలాంటి ల్యాబ్‌లు జిల్లాలో విద్యార్థుల శాస్త్రీయ దృష్టి విస్తరించడానికి తోడ్పడతాయని, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ఖగోళ శాస్త్రం వైపు ఆకర్షితులవుతారని మంత్రి అన్నారు.
నిర్మల్ జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నిర్మల్ జిల్లా బాసర మండలంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. దెబ్బతిన్న పంటలను పూర్తిస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టపరిహారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.






















