UP CM Yogi Adityanath: అయోధ్యలో రామ మందిరం కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో అయ్యేదా?: యూపీ సీఎం యోగి
Telangana Elections 2023: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనో, బీఆర్ఎస్ పార్టీతోనో అయ్యేదా అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రశ్నించారు.
Yogi Adityanath Chief Minister of Uttar Pradesh: కాగజ్ నగర్: డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనో, బీఆర్ఎస్ పార్టీతోనో అయ్యేదా అని ఆయన ప్రశ్నించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని SPM గ్రౌండ్ లో శనివారం ఏర్పాటు చేసిన రామరాజ్య స్థాపన సంకల్ప సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గోన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్ కు వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సిర్పూర్ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు, పార్టీ శ్రేణులు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఆపై ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న యోగి ఆదిత్య నాథ్ ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నా కోటి కోటి వందనాలు అని స్పీచ్ మొదలుపెట్టిన యూపీ సీఎం యోగి... అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ప్రస్తావించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో అయ్యేదా అని ప్రశ్నించారు. రామాలయం కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు.
యూపీలో చెల్లని బీఎస్పీ, తెలంగాణలో చెల్లుతుందా ?
సిర్పూర్ లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయని, సొంత రాష్ట్రాల్లో చెల్లని బీఎస్పీ పార్టీ తెలంగాణలో చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఅర్ అరాచక, ఆన్యాయ పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పాలన ముస్లింలకు అనుకూలంగా సాగుతుందని, తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తేనే కొన్ని మతాల ఆరాచకం తగ్గుతుందన్నారు. బీఆర్ఎస్ అంటేనే బ్రష్టా చార్ రిస్వత్ కొర సమితి అని అన్నారు. యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చాక కర్ఫ్యూ, ధర్నాలు లేవన్నారు.
తెలంగాణలో పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని సీఎం కేసీఆర్, పాలన సమర్థవంతంగా ఎలా చేస్తాడని యూపీ సీఎం యోగి ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కామన్ దోస్తు ఎంఐఎం పార్టీ అని వీరంతా కలిసి ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, ప్రతి ఇంటికి పథకాలు అందుతున్నాయని చెప్పారు. తెలంగాణలోను బీజేపీ అధికారంలోకి వస్తేనే, తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply