Revanth Reddy: డీఎస్‌కు రేవంత్ రెడ్డి నివాళి - ఆయన ఫ్యామిలీకి అండగా కాంగ్రెస్: సీఎం
Telangana News: రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
Revanth Reddy News: నిజామాబాద్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఆదివారం (జూన్ 30) ఉదయం నిజామాబాద్ లోని డీఎస్ నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయన పార్థీవదేహానికి నమస్కరించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీఎస్ కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. హైదరాబాద్‌లోని డీఎస్ నివాసంలో డీఎస్ గుండెపోటుతో జూన్ 29న మరణించిన సంగతి తెలిసిందే. అదే రోజున రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ఉండడంతో నేడు డీఎస్ కు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పీసీసీ అధ్యక్షుడుగా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీఎస్ ఎంతో కృషి చేశారు. 2009లోనూ డీఎస్ సారధ్యంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా డీఎస్ ఎదిగారు. కొంతకాలం పార్టీకి దూరమైనా పార్లమెంట్ లో డీఎస్ ను సోనియాగాంధీ ఆప్యాయంగా పలకరించేవారు. పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారు. చనిపోయినపుడు తనపై కాంగ్రెస్ జెండా కప్పాలని డీఎస్ కోరిక. అందుకే ముఖ్య నాయకులను పంపి వారి కోరిక తీర్చాము.
డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డి. శ్రీనివాస్ జూన్ 29 (శనివారం) తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆ సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. నిజామాబాద్ లోని డీఎస్ కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నేడు (జూన్ 30) జరగనున్నాయి.