Yoga for Pregnant Ladies: సిజేరియన్లకు చెక్, యోగాతో నార్మల్ డెలివరీలు!
Yoga for Pregnant Ladies: సిజేరియన్లకు చెక్ పెడ్తూ నార్మల్ డెలివరీలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యోగా, పౌష్టికాహారం వంటివి అందిస్తూ అన్ని రకాలను గర్భిణీలను సహజ కాన్పులకు సిద్ధం చేస్తున్నారు.
Yoga for Pregnant Ladies: కొంత కాలంగా సిజేరియన్ డెలవరీలే ఎక్కువగా అవుతున్నాయి. సహజ కాన్పులకు భయపడి కొందరు, నొప్పి లేకుండానే పిల్లల్ని కనొచ్చని మరికొందరు సిజేరియన్లపై మక్కువ చూపిస్తున్నార. అలాగే ప్రైవేటు ఆస్పత్రులు కూడా డబ్బుల కోసం ఎక్కువగా సిజేరియన్లే చేస్తుంటాయి. ఈ క్రమంలోనే సహజ కాన్పులు ఎక్కువ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సహజ కాన్పులు అయ్యేందుకు ప్రభుత్వం... ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అవలంభించేలా చర్యలు తీసుకుంటోంది. గర్భిణులకు యోగా, ఎక్సర్ సైజ్, పౌష్టిక ఆహారంతో పాటు మానసికంగా ధృంఢంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
దాదాపు వంది మందితో శిక్షణ..
యూకేలో శిక్షణ పొందిన డాక్టర్ తో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 70 మంది, జిల్లా దవాఖానాలో 30 మంది వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. గర్భిణులు చేయాల్సిన ప్రినటల్ యోగా, పోషకాహారం పై శిక్షణ ఇప్పించారు. నెల రోజులుగా ఆసుపత్రికి వస్తున్న గర్భిణులకు వీటిని వివరిస్తున్నారు. యోగా, తేలిక పాటి వ్యాయామం చేయించడంతో పాటు సహజ ప్రసవాలపై సన్నద్ధం చేయడానికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు వెయ్యి మంది గర్భిణులతో యోగా సాధన చేయించారు. ఇందు కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. స్త్రీ వైద్య, మానసిక, పోషకాహార నిపుణులను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ లోనే అమలు చేశారు.
మూడో నెల నుంచే వ్యాయామాలు..
పిండం ఏర్పడిన మూడో నెల నుంచి ప్రత్యేకమైన వ్యాయామాలు, యోగా సాధన చేస్తే.. సిజేరియన్ బాధ లేకుండా సహజ ప్రసవమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తేలిక పాటి వ్యాయామాలు, ప్రాణాయామాలు, వజ్రాసనం వంటివి మేలు చేస్తాయి. కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ బరువు పెరగడం వల్ల వెన్ను, భుజం, కాళ్ల నొప్పులు వస్తాయి. స్ట్రెచింగ్కు సంబంధించిన వ్యాయామాలు నొప్పిని కలిగించకుండా చేస్తాయి. శరీరం మనకు అనుకూలంగా, కండరాలు దృఢంగా ఉండి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచకుండా శరీరం విశ్రాంతి తీసుకోవడానికి ప్రినటల్ యోగా ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
కచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి..
ఈ కార్యక్రమానికి గర్భిణుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వస్తున్న గర్భిణులు వైద్యుల సూచన మేరకు యోగా శిక్షణకు వస్తున్నారు. సిజేరియన్ కు పూర్తిగా చెక్ పెట్టే విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్న ప్రయోగం సత్ఫలితాలనైతే ఇస్తోందని అంటున్నారు. ఇదే కొనసాగితే సిజేరియన్ల కంటే కూడా నార్మల్ డెలివరీలు ఎక్కువ జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల్లో కంటే కూడా ప్రభుత్వ దవాఖానాల్లోనే నార్మల్ డెలివరీలు చేసేందుకు ఎక్కువ అవకాశం ఉందని వివరిస్తున్నారు. కాబట్టి ప్రజలంతా ప్రభుత్వ ఆసుపత్రుల సౌకర్యాలను అందుకోవాలని చెబుతున్నారు.