Adilabad News: ఆదిలాబాద్ జిల్లాకు సీతక్కనే ఇంఛార్జ్ మంత్రిగా కొనసాగించాలి.. ప్రభుత్వానికి తుడుం దెబ్బ డిమాండ్
Telangana Incharge Ministers | ఇటీవల జిల్లాల ఇంఛార్జ్ మంత్రుల మార్పులు జరిగాయి. అయితే ఆదిలాబాద్‌కు ఇంఛార్జ్ మంత్రిగా సీతక్కనే కొనసాగించాలని తుడుం దెబ్బ డిమాండ్ చేసింది.

Telangana News | ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ధనసరి అనసూయ (Seethakka)నే తిరిగి కొనసాగించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ డిమాండ్ చేశారు. అదిలాబాద్ (Adilabad) జిల్లా మావల మండల కేంద్రంలోని కుమ్రం భీం కాలనీలో స్థానిక ఆదివాసీలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో సీతక్కనే ఇన్చార్జి మంత్రిగా కొనసాగించాలని ఆదివాసీలంతా చర్చించారు.
మాపై అవగాహన ఉన్న మంత్రినే కొనసాగించాలి
ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ... అదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీల జిల్లా అని చెప్పే పాలక ప్రభుత్వాలు ఆదివాసీలు ఇప్పుడిప్పుడే రాజకీయంగా మరీ ముఖ్యంగా ఆదివాసి మహిళలు ముందుకు వచ్చి రాజకీయంగా ఎదుగుతున్నారు. తనకు తాను అభివృద్ధి చెంది అవకాశంలో సగం పోరాటంలో సగం భాగం అంటూ తెలంగాణ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేలా ఆదివాసీ మహిళలలో ధనసరి సీతక్క ఒకరు.. అడివి తల్లి ముద్దుబిడ్డ ఆదివాసీల ఆశాజ్యోతి ఆడబిడ్డ ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి యొక్క మనలను పొందుతూ ముఖ్యంగా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో పాటు ఆదివాసి చట్టాలు హక్కులు ఆదివాసీల సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారు.
సీతక్కను తొలగించడం అంటే ఆదివాసీలను అవమానించడమే
ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం, అన్ని వర్గాల ప్రజల సమస్యలను ఇప్పుడిప్పుడే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ధనసరి సీతక్క మంత్రివర్యులని నిజామాబాద్ జిల్లాకు మార్చడం ఆదివాసులను అవమానపరచడమే అవుతుందన్నారు. ఇదీ కచ్చితంగా ఆదివాసీలను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచడమే అవుతుందనీ, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఈపాటికె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దత్తత తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధిని కోరుకునేవారు అయితే మంత్రి సీతక్క విషయంలోను పునరాలోచన చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులుగా సీతక్కనే కొనసాగించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. తమ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు జీవన విధానం, సమస్యలు తెలిసిన సీతక్కనే ఆదిలాబాద్ ఇంఛార్జ్ మంత్రిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఆదివాసి మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఉయిక ఇందిర, అదిలాబాద్ డివిజన్ కమిటీ ఉపాధ్యక్షులు ఆత్రం గణపతి, మావల మండల అధ్యక్షులు వెడ్మ ముకుందరావు, నాయకులు తోడం ప్రకాష్, కుడిమేత జంగు, కుమ్ర గోవింద రావ్, గోడం గణేష్, గేడం శ్యాంరావు, కనక మనోహర్, మడావి దశరథ్, వేట్టి బాలు, సిడాం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





















