Asifabad Protest against GO 49: జీవో 49 రద్దు కోసం జులై 28న ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాకు పిలుపు
Protest at Asifabad Collectorate | పులుల సంరక్షణ కేంద్రం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 49ను రద్దు చేయకపోతే జులై 29న ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడతామని సిడాం జంగుదేవ్ అన్నారు.

Asifabad Tiger Reserve | ఉట్నూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పులుల సంరక్షణ కేంద్రం జివో 49 ను రద్దు చేస్తూ తెలంగాణ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిడాం జంగుదేవ్ అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఆదివాసీ, ఆదివాసేతర ప్రజలను నిర్వాసితులను చేసేందుకు ఆ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
భారీ ధర్నాకు తరలిరావాలని పిలుపు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో శుక్రవారం విద్యార్థి సంఘం నాయకులతో కలిసి సమావేశం నిర్వహించి మాట్లాడారు. జీవో 49 ను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 28 ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట “జివో 49 రద్దు పోరాట కమిటీ” తుడుం దెబ్బ, ప్రజా సంఘాలు తలపెట్టిన ధర్నాను పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని విద్యార్థులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆదివాసులను కనుమరుగు చేసే కుట్రలు..
‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో రాక ముందు ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభలో ఆదివాసీలకు అనేక హామిలిచ్చారు. నేడు హామీలు విస్మరించడమే కాకుండా ఆదివాసులను కనుమరుగు చేసే కుట్రలకు తెరతీశారనీ, కేంద్రంలోని బీజేపీ సర్కారు అడూగుజాడల్లో వారు నడుస్తున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు దేశంలోని ఆదివాసీ తెగల నిర్మూలనకు పూనుకుంది. ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో అభయారాణ్యాలు, నేషనల్ పార్క్ లు, టైగర్ కారిడార్లు, టైగర్ జోన్లు, బహుళజాతి మైనింగ్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు.
ఆదివాసీ తెగల నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర
రాజ్యాంగ విరుద్ధమైన కార్పోరేట్ మైనింగ్ కంపెనీలను వ్యతిరేకిస్తున్న సామాన్య ఆదివాసీ తెగలపై భధ్రత బలగాలు, పారా మిలటరీ బలగాలతో హత్యలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలోని ఆసిపాబాద్ జిల్లాలో టైగర్ జోన్ ఏర్పాటు చేశారు. ఇక్కడి గోండు, కోయా, కొలాం తదితర ఆదివాసీ తెగల నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. కార్పోరేట్ల కనుసన్నల్లోనే పులుల పెంపకం పేరుతో ప్లాన్ చేశారు.
బిజెపి - కాంగ్రెస్ పార్టీలు రెండు దొందూ దొందే.. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వీరిని ప్రజలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం జి.వో నెం.49 ను శాశ్వతంగా రద్దు చేసి ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాలు అందించాలని’ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిడాం జంగుదేవ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంగం దీపక్, పెందుర్ తుకారాం, విద్యార్థి సంఘం నాయకులు పెందుర్ మోతిరాం, కుమ్ర జుగదిరావు, ఆత్రం శంకర్, పంద్ర ఓనిక్ రావు, పాల్గొన్నారు





















