Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !
ఏడాది నుంచి గ్రామ పంచాయితీలకు కేంద్ర, రాష్ట్ర ఫైనాన్స్ నిధులు ఆగిపోయాయి. సర్పంచులు ఎవరికి చెప్పుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
గ్రామంలో అప్పుసోప్పు చేసి అభివృద్ధి కోసం నిధులు ఖర్చు చేస్తే బిల్లులు మంజూరు కావడం లేదని సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ లో నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ల సమస్య హాట్ టాపిక్ గా మారింది. అయితే జిల్లాలో మొత్తం 531 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏడాది నుంచి గ్రామ పంచాయితీలకు కేంద్ర, రాష్ట్ర ఫైనాన్స్ నిధులు ఆగిపోయాయి. సర్పంచులు ఎవరికి చెప్పుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. నందిపేట సర్పంచ్ ఘటనతో నందిపేట్ మండలంలోని పలువురు సర్పంచులు మంగళవారం డిపిఓ అధికారి జయసుధను కలిశారు. తాము అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశాము. వడ్డీలు పెరిగిపోతున్నాయి. తలకు మించిన భారంగా మారిందని సర్పంచులు గోడు వెళ్లబోసుకున్నారు. అయితే పంచాయితీ అధికారి జయసుధ త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.
అభిప్రాయబేధాలు తలెత్తినప్పుడు మాత్రం కథ అడ్డం
గ్రామాల్లో సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేస్తూ.. బిల్లులు వచ్చాక తీసుకుంటున్నారు. గ్రామాల్లో తమకు పేరు రావాలనే కోరిక, ఆయా బిల్లుల్లో ఎంతో కొంత రాబడి ఉంటుందని ఆశపడుతున్నారు. అధికారులు కూడా పనులు జరిగితే చాలని ఊరుకుంటున్నారు. ఎలాంటి వివాదాలు లేనంత వరకు ఇదంతా బాగానే ఉంటుంది. కానీ ఎక్కడైనా ప్రజాప్రతినిధుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తినప్పుడు మాత్రం కథ అడ్డం తిరుగుతోంది. అప్పుడు అధికారులకు నిబంధనలు గుర్తుకొస్తున్నాయి.
బిల్లులు సకాలంలో వస్తే ఓకే, లేకపోతే !
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో కాలువలు, రోడ్లు వేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీలు, షెడ్లు నిర్మించారు. ఆయా పనులు ఎక్కువ శాతం సర్పంచులే చేశారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య పనులు కావటంతో పెద్ద గుత్తేదారులు ముందుకు రాలేదు. నామినేటెడ్ విధానంలో చేస్తుండటంతో ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పనులు పూర్తి చేసేందుకు గడువుతో కూడిన లక్ష్యాలు ఉండటంతో అధికారులు కూడా సర్పంచులతో చేయించడానికే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు సకాలంలో వస్తున్నంత వరకు బాగానే ఉంటుంది. ఆలస్యమైన సందర్భంలోనే కార్యాలయాలకు వెళ్లి నిలదీయటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయానికి వచ్చి గొడవకు దిగిన సందర్భాలున్నాయి.
సర్పంచుల ఆత్మహత్యల కలకలం !
వెచ్చించిన నిధులు మంజూరు కాక చేసిన అప్పులు పెరిగిపోయి సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకు దారితీస్తోంది. ఏడాది కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లులు మంజూరు చేయకపోవడం... గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయకుంటే ప్రజలతో ఇబ్బంది ఇలా అనేక సమస్యలు పడుతున్నారు సర్పంచులు.
సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం!
నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నందిపేట్ సర్పంచ్ దంపతులు సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని మంట అంటించుకునేందుకు ప్రయత్నించారు. అక్కడున్న పోలీసులు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేధింస్తున్నారని సర్పంచ్ దంపతులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ బిల్లులు రావడం లేదని మనోవేదనకు గురైన నందిపేట్ సర్పంచ్, ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందిపేట్ కు చెందిన సర్పంచ్ సాంబార్ వాణి, భర్త తిరుపతి(వార్డ్ మెంబర్) తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. రెండు కోట్ల వ్యయంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వాటి బిల్లులు ఇవ్వకుండా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేధిస్తున్నారని ఆరోపించారు. ఉప సర్పంచ్ చెక్కులపై సంతకం చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. బీజేపీ నుంచి ఎన్నికైన తాను అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ లో చేరామని, అయినా తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.