Rythu Bandhu Scheme: రైతు బంధుపై పంజాబ్ స్పీకర్ ప్రశంసలు, స్నేహితుడి కోసం నిజామాబాద్‌లో కుల్తార్ సింగ్ పర్యటన
Rythu Bandhu scheme: తెలంగాణలో అమలు అవుతున్న వివిధ పథకాలు, అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు పంజాబ్ స్పీకర్ సాంద్వాన్ బృందం నిజామాబాద్ కు వచ్చింది.
అన్నదాతలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అండగా ఉంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతు బంధు పథకం నా భూతో నా భవిష్యత్ అని కొనియాడారు. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం ఎక్కడ పనిచేసినా వారిని అభినందించి ప్రోత్సహించాలి అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి చాలా ఆశ్చర్యానికి గురవుతున్నామని అన్నారు.
తెలంగాణలో అమలు అవుతున్న వివిధ పథకాలు, అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు పంజాబ్ స్పీకర్ సాంద్వాన్ బృందం నిజామాబాద్ కు వచ్చింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వారిని సాదరంగా ఆహ్వానించి వారితో కలిసి నిజామాబాద్ లో పర్యటించారు. నూతన కలెక్టరేట్, ఐటీ హబ్‌తో పాటు పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో పంజాబ్ బృందం మీడియాతో మాట్లాడింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటించాలనుకున్నామని అర్బన్ ఎమ్మెల్యే బీగాల కాలేజీ రోజుల్లో తన సన్నిహితుడైనందున నిజామాబాద్ కు వచ్చామని పంజాబ్ స్పీకర్ సాంద్వాన్ తెలిపారు. నిజామాబాద్ నగరానికి గతంలో చాలాసార్లు వచ్చానని కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అన్నారు.
కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ లాగా రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉంటే భారతదేశం విశ్వ గురువు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రైతుబంధు ద్వారా ఆర్థిక సహాయ అందించే పథకం చాలా గొప్పదని, అదేవిధంగా ఉచిత కరెంటు ఇంటింటికి తాగునీరు పథకాలు ఆదర్శనీయమన్నారు, పేదింటి ఇక ఆడబిడ్డల కోసం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం తనని ఎంతో ఆకర్షించిందని తెలిపారు. తెలంగాణలో పర్యటించడం తమ బృందానికి సంతోషకరంగా ఉందని అన్నారు..
అనంతరం అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ.. పంజాబ్ స్పీకర్ తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను వారికి వివరించగా చాలా ఆశ్చర్యానికి గురయ్యారని, ఇంతకంటే ఎన్నో రెట్ల ఎక్కువ బడ్జెట్ ఉండే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాలు లేవని వారు అన్నట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లిన కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల గురించి మాట్లాడడం తమకు గర్వకారణంగా ఉందని తెలిపారు.
యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రైతు బంధు సాయం నిధులు ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంట పెట్టుబడికి రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు సీజన్లలో ఎకరాకు రూ.5000 చొప్పున పంట సాయం అందిస్తోంది. ప్రస్తుతం యాసంగి పంట కాలానికిగానూ 7,600 కోట్ల రూపాయలను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. ప్రతి ఏడాది, ఖరీఫ్ సీజన్ తరహాలోనే మొదట ఒక ఎకరం రైతులకు రైతు బంధు నిధులు జమ చేస్తారు. ఆపై అధిక ఎకరాలు ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం రైతు బంధు సాయాన్ని అందిస్తోంది. ధరణి పోర్టల్ నమోదు చేసుకున్న పట్టాదారులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు అర్హులని తెలిపారు. మొదటిసారి పెట్టుబడి సాయం తీసుకోబోయే రైతులు క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సూచించింది.