MP Aravind On Bandi Comments: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్ధించను: బీజేపీ ఎంపీ అర్వింద్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణలో సామెతలు చాలా ఉంటాయని, వాటిని జాగ్రత్తగా వాడాలని బండి సంజయ్ కు బీజేపీ ఎంపీ అర్వింద్ సూచించారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యల్ని బండి సంజయ్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందని సూచించారు. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడం కంటే దర్యాప్తు సంస్థలు, విచారణ సంస్థలు అడిగిన విషయాలకు సమాధానాలు చెబితే బెటర్ అని వ్యాఖ్యానించారు.
బండి వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదు
బండి సంజయ్ వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తాను చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చుకోవాలన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం అంటే పవర్ సెంటర్, పవర్ హౌస్ కాదని, కో ఆర్డినేషన్ చేసుకోవడం వారి బాధ్యత అన్నారు. కనుక ఇష్టరీతిన మాట్లాడకూడదని సూచించారు. కవితపై చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. అయితే కవితపై బీజేపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా.. ఆమె అన్న కేటీఆర్ ఉరుకులు పరుగుల మీద ఢిల్లీకి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. కవితను అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పకుండా నేతల్ని ఢిల్లీకి పంపడంలో ఆయన ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.
అరబిందో శరత్ చంద్రారెడ్డి గానీ, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వాళ్ల అబ్బాయి, ఇటు రామచంద్ర పిళ్లైగానీ, బోయినపల్లి అభిషేక్, ఇందులో ఇన్వాల్స్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఢిల్లీ లిక్కర్ కేసులో ఏం సంబంధం ఉందో చెప్పాలన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో క్లీన్ చిట్ గా బయటకు రావాలన్నారు. బీజేపీపై ఎదురుదాడి చేయడానికి ఇది సమయం కాదని, ఇంకా ఆరు, ఎనిమిది నెలల టైం ఉందన్నారు అర్వింద్.
వీడియోలతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు!
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్ వీడియోలు తయారుచేసి డ్రామాలు చేశారని ఆరోపించారు. ఆ స్వామి ఎవరో బీజేపీకి తెలియదు. ఆ ఫామ్ హౌజ్ బీఆర్ఎస్ నేతలదన్నారు. ఒకవేళ ఏమైనా పైసలు దొరికాయా అంటే వాటిని కేసీఆర్ ఎక్కడా చూపించలేదు. అంటే ఇది ఆయన డ్రామాలని తెలిసిపోయిందన్నారు. కోర్టుకు కూడా పైసలు ఇవ్వలేదు, చూపించలేదన్నారు. కోర్టు చివాట్లకు సీఎం కేసీఆర్ ఇప్పటికే రాజీనామా చేసి ఉంటే బెటర్ అన్నారు. బీఎల్ సంతోష్ కోర్టుకు వెళ్లారు. దానిపై కోర్టు స్టే ఇచ్చింది. మీరు తప్పు చేశారు కనుక కోర్టుకు వెళ్లడానికి భయపడ్డారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ప్రజల పాలన కోసం అందుబాటులో ఉండాలని, కానీ చెల్లెలు కవితను కాపాడుకోవడం కోసం ఢిల్లీకి రావడం ఏంటని ప్రశ్నించారు. భవిష్యత్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ పై తెలంగాణలో ప్రచారం జరుగుతుందని, అలాంటి వ్యక్తి ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కవితను కాపాడుకోవడం కోసం ఢిల్లీలో చక్కర్లు కొట్టడం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు.