Nizamabad రిజిస్ట్రేషన్ శాఖలో సస్పెండ్ అయిన ఉద్యోగుల వాంగ్మూలం తీసుకున్న అధికారులు
Nizamabad Illegal Registrations: నిజామాబాద్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్న ఇద్దరు సస్పెన్షన్‌కు గురి కాగా, వారి వాంగ్మూలం అధికారులు సేకరించారు.
నిజామాబాద్ రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం దుమారం రేపుతున్న నేపథ్యంలో కీలక అడుగు ముందుకు పడింది. మెదక్ జిల్లా రిజిస్టర్ రవీందర్ అక్రమాలపై విచారణ చేపడుతున్నారు. నిజామాబాద్ డీఐజీ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లపై మరోసారి విచారణ చేపట్టారు. రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్న ఇద్దరు సస్పెన్షన్‌కు గురి కాగా, వారి వాంగ్మూలం అధికారులు సేకరించారు. విచారణలో గుర్తించిన సమాచారంతో శాఖాపరమైన చర్యల కోసం నివేదిక సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలల్లో బయట పడ్డ నాన్ లే ఔట్ భూములకు దస్తావేజులు క్రియేట్ చేయడం నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ నారాయణ రెడ్డి విచారణకు ఆదేశించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు వ్యాపారం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఏప్రిల్ 10వ తేదీన విచారణ జరిపి ముగ్గురు అధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటి నుంచి శాఖాపరమైన విచారణ మొదలుపెట్టి కొత్తగా ఇద్దరు అధికారులు అక్రమాలు చేసినట్టు గుర్తించి ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ఆధారంగానే శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
జిల్లాలో ఆరుగురు ఎస్సైల బదిలీ
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆరుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఎస్సైల బదిలీలపై నిజామాబాద్ సీపీ కార్తికేయ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ బదిలీ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న యాదగిరి గౌడ్ ను మాక్లూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా, నవీపేట్, అటాచ్ మాక్లూర్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా చేస్తున్న పెంటా గౌడ్ ను నిజామాబాద్ సీసీ ఆర్ బీకి బదిలీ చేశారు.
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ప్రదీప్ కుమార్ గాజులను ఆర్మూర్ పీఎస్ ఎస్సైగా, ప్రస్తుతం భీమ్ గల్ పోలీస్ స్టేషన్, వి ఆర్ అటాచ్డ్ అయి విధులు నిర్వహిస్తున్న గంగుల శ్రావణ్ కుమార్‌ను నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా, నిజామాబాద్ వన్ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న తాళ్ల సాయికుమార్‌ను ఆరవ పోలీస్ స్టేషన్ ఎస్సైగా, ప్రస్తుతం ఆరో పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు ట్రాఫిక్ ఎస్సైగా బదిలీ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్ నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు.