Nizamabad జిల్లా కేంద్రంలో ముగ్గురు అనుమానిత యువకుల సంచారం, ప్రశ్నించిన వారిపై దాడి !
నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్ఐ కార్యకలాపాలను నడిపించిన కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్ఐఏ బృందాలు ఇప్పటికే జిల్లా పై నజర్ వేశాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ముగ్గురు యువకులు గత కొంత కాలంగా నిజామాబాద్ నగరంలో తిరుగుతూ పలు బ్యాపారాలు చేస్తున్నారు. నిజామాబాద్ పాసింగ్ తో ఉన్న TS 16 FF 7426 నెంబర్ గల మారుతి వ్యాన్ లో తిరుగుతున్నారు. వీక్లీ మార్కెట్ వద్ద వీరు వ్యాన్ ను వేగంగా నడపడాన్ని చూసి ఓ వ్యక్తి వారించగా ఆ వ్యక్తిపై దాడికి దిగారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు , ఏం చేస్తున్నారు అనేదానిపై ప్రశ్నించారు. దీంతో వారి వద్ద ఉత్తర ప్రదేశ్ రాస్తారనికి చెందిన ఆధార్ కార్డులు ఉన్నాయి. దీంతో వీరు ఉత్తర ప్రదేశ్ వాసులుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఇక్కడే తిరుగుతూ అనుమానాస్పదంగా వ్యాపారం చేస్తున్నారు.
అసలే జిల్లాలో పీఎఫ్ఐ భయాలు !
ఇప్పటికే జిల్లాలో పీఎఫ్ఐ కార్యకలాపాలను నడిపించిన కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్ఐఏ బృందాలు ఇప్పటికే జిల్లా పై నజర్ వేశాయి. ఈ క్రమంలో సిపి నాగరాజు ఈ అనుమానితుల విషయం సిరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలలుగా జిల్లా కేంద్రంలో పిఎఫ్ఐ కార్యకలాపాలపై సిపి నాగరాజు సీరియస్ గా ఉన్నారు. కానీ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి అనుమానాస్పద యువకులు ఉండడం వారికి స్థానికంగా ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యాన్ డ్రైవ్ చేస్తున్న యువకుడి వద్ద ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు, అంతేకాకుండా యువకుడికి సంబంధించిన ఆధార్ కార్డు లేక యూపీకి చెందిన ఆధార్ కార్డుతో ఇక్కడ నివాసం ఉంటున్నారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిజామాబాద్ నగరంలో జులై 4 న పిఎఫ్ఐ ట్రైనింగ్ కేంద్రాన్ని గుర్తించి అందులో శిక్షకులను పట్టుకున్నారు. విచారణ కూడా ఎన్ ఐ ఏ బృందాలు ముమ్మరం చేశాయి. దీంతో జిల్లాపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
యూపీకి చెందిన యువకులు ఇక్కడకి ఎప్పుడు వచ్చారు. వారు ఎందుకు వచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారు. వారు ఎక్కడ నివాదం ఉంటున్నారు. వారికి నిజామాబాద్ పాసింగ్ తో ఉన్న మారుతి వ్యాన్ ఎవరిచ్చారు ఇలాంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురు వన్ టౌన్ పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది.
నిషేధిత పీఎఫ్ఐ కార్యకర్తలు తెలంగాణలో దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల తెలిపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేరళ, తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పీఎఫ్‌ఐ ప్లాన్ చేసిందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై నిఘా పెట్టాలని పోలీసులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఆర్‌ఎస్‌ఎస్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులను పోలీసులు అలర్ట్ చేశారు. పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు చట్టవిరుద్ధమైన సంస్థలని కేంద్రం వాటిపై నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద పీఎఫ్ఐపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.