(Source: ECI/ABP News/ABP Majha)
Nirmal: కుక్కను చంపి జింక మాంసం పేరుతో అమ్మకాలు - అది తిన్నవారిలో ఒకటే ఆందోళన!
మేక మాంసం, గొర్రె మాంసం లాంటివి ఎక్కువ మంది గుర్తు పడతారు. జింక లాంటి అరుదైన జంతువు మాంసాన్ని గుర్తించడం కష్టం.
కుక్కను చంపి మాంసం విక్రయించిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. పైగా కుక్క మాంసాన్ని జింక మాంసం పేరుతో అమ్మారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండల కేంద్రానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క ఇటీవల దొంగతనానికి గురైంది. దీంతో అతడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలలో పరిశీలించగా మండలంలోని పొట్టపెల్లి (కె) గ్రామానికి చెందిన శ్రీనివాస్, చామన్ పెల్లి గ్రామానికి చెందిన వరుణ్ అనే వ్యక్తులు అపహరించినట్లు గుర్తించారు. వారిని విచారించగా కుక్కను చంపి జింక మాంసం పేరుతో విక్రయించినట్లు తెలిపారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాహుల్ తెలిపారు.
మేక మాంసం, గొర్రె మాంసం లాంటివి ఎక్కువ మంది గుర్తు పడతారు. జింక లాంటి అరుదైన జంతువు మాంసాన్ని గుర్తించడం కష్టం. ఇదే ఆసరాగా జనాలను బోల్తా కొట్టించవచ్చునని ఇద్దరు మోసగాళ్లు అనుకున్నారు. అప్పుడే వారి కన్ను కుక్కపై పడింది. వీధి కుక్క కంటే పెంపుడు కుక్క అయితే మేలు అనుకున్నారు. వెంటనే ఓ పెంపుడు కుక్కను దొంగిలించారు. గుట్టుచప్పుడు కాకుండా చంపేశారు.
పథకం ప్రకారం చుట్టుపక్కల గ్రామాల్లో జింక మాంసం అని చెప్పి అమ్మారు. చుట్టూ అడవులు ఉండే సరికి నిజంగానే జింక మాంసం అనుకుని చాలా మంది కొనుక్కున్నారు. అయితే కుక్క యజమాని ఫిర్యాదుతో వారి బాగోతం బయటపడింది. పోలీసులు సీసీటీవీ కెమెరాను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు కుక్కను అపహరించినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకుని విచారణ చేపట్టారు. మరోవైపు కుక్క మాంసం తిన్నవాళ్లంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిందితులపై కేసి మరింత దర్యాప్తు చేస్తున్నారు.