Nizamabad: కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ముస్లిం దంపతులు.. హిందూ సాంప్రదాయంలో పెళ్లి, ప్రశంసల వెల్లువ
చందన అనే బాలిక తన తల్లిదండ్రులను కోల్పోయింది. ఇది తెలుసుకున్న ప్రిన్సిపల్ ఇర్ఫానా బాను, అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నా.. పెద్ద మనసుతో చందనను దత్తత తీసుకున్నారు.
‘మానవత్వానికి, ప్రేమకు.. మతంతో పనేముంది’ అనేది మరోసారి రుజువైంది. దత్తత తీసుకున్న ఓ హిందూ యువతికి.. హిందుత్వ సంప్రదాయం ప్రకారం ముస్లింలు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఆదివారం ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ వివాహంలో మరో విశేషం కూడా ఏంటంటే.. అది కులాంతర పెళ్లి. ఆ పెళ్లికి వచ్చిన అతిథులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం బాన్సువాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్‌గా ఇర్ఫానా బాను అనే వ్యక్తి ఉన్నారు. ఈయన పదేళ్ల క్రితం ఇదే జిల్లాలోని తాడ్వాయి ప్రాంతంలో ఉన్న గురుకులకు ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. ఆ సమయంలో ఓ దుర్ఘటనలో చందన అనే బాలిక తన తల్లిదండ్రులను కోల్పోయింది. అదే సమయంలో చందన అనే బాలికను ఆమె బంధువులు ఇర్ఫానా బాను ప్రిన్సిపల్‌గా ఉన్న గురుకులంలో చేర్పించారు. అమ్మాయికి తల్లిదండ్రులు లేరని తెలుసుకున్న ఇర్ఫానా బాను, అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నా.. పెద్ద మనసుతో చందనను దత్తత తీసుకున్నారు. గురుకులంలో చదువుతున్న చందనను సెలవుల్లో తన ఇంటికే తీసుకెళ్లేవారు. ఆమె ఇంటర్మీడియట్ పూర్తి చేశాక, హైదరాబాద్‌లో డీఎంఎల్‌టీ (ల్యాబ్ టెక్నీషియన్) కోర్సు చేయించారు. అది కూడా చందన విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇదే విషయం ఇతర టీచర్లతో పంచుకున్నారు.
Also Read: Match Box Price: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే..
అలా ఓ టీచర్ ఓ సంబంధం తెచ్చారు. నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్‌దేవ్ పల్లి గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసే వెంకట్రాంరెడ్డితో సంబంధం కుదిర్చారు. అందరూ మంచివారని తేలడంతో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. వధూవరులు ఇద్దరూ హిందువులు కాబట్టి.. ఆ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి జరిపారు. ఇర్ఫానా బాను భర్త షేక్ అహ్మద్‌తో కలిసి వరుడి కాళ్లు కడిగారు. అన్ని లాంఛనాలతో ఘనంగా పెళ్లి చేశారు. కట్నం, ఇతర పెట్టుపోతలకు ఇర్ఫానా బానుతో పాటు గురుకులంలోని కొందరు టీచర్లు సహకారం అందించారు. అలాగే వివాహం, భోజన ఖర్చులకు పట్టణానికి చెందిన సాయిబాబా గుప్త స్వచ్ఛంద సాయం చేశారు. ఇర్ఫానా బాను ఇద్దరు కూతుర్లు, అల్లుళ్లు, బంధువులు విచ్చేసి ఆశీర్వదించారు. బాన్సువాడ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, కౌన్సిలర్ నార్ల నందకిషోర్, మహ్మద్ ఎజాస్‌తో తదితరులు కూడా వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.
చందనను ఆమె 6వ తరగతిలో ఉన్నప్పుడు తాను దత్తత తీసుకున్నానని.. డీఎంఎల్‌టి వరకు చదివించి పెళ్ళి చేస్తున్నానని ప్రిన్సిపల్ ఇర్ఫానా బాను వెల్లడించారు. తమ సిబ్బంది, ఇతర పెద్దల సహకారంతోనే నేడు వివాహం జరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మానవత్వానికి మతం అడ్డుకాదని.. తనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని.. చందన తన మూడో కూతురు అని ఇర్ఫానా బాను అన్నారు.
Also Read: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?
Also Read: పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త.. ఆమెకు ఏం చెప్పి అమ్మాడో తెలుసా!