(Source: ECI/ABP News/ABP Majha)
Koppula Eshwar: బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై త్వరలోనే నిర్ణయం - మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ
TS Minister Koppula Eshwar: ఆయా బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్న వారి కోరికను పరిగణనలోకి తీసుకుని చర్చిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు.
వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దివ్యంగుల సంక్షేమం కోసం సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా అనేక ప్రత్యేక సౌకర్యాలను రూపొందించిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయా బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్న వారి కోరికను పరిగణనలోకి తీసుకుని చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంధుల ఆరాధ్య దైవం, అంధుల కోసం ప్రత్యేకంగా లిపిని రూపొందించిన డా, లూయిస్ బ్రెయిలీ 214వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ అంధ ఉద్యోగ, ఉపాధ్యాయ, బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జయంతి వేడుకలకు రాష్ట్ర ఎస్సి, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో ముందుగా బ్రెయిల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అతిథులు ముందుగా బ్రెయిల్ 214వ జయంతి సందర్భంగా అంధులతో కేక్ కట్ చేసి వారికి తినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్ ను వారు ఆవిష్కరించి.. బ్రెయిల్ జన్మదినం సందర్భంగా అంధులు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పాత్రలు అందించారు.
అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక, సీఎం కేసీఆర్ నాయకత్వంలో దివ్యంగుల సంక్షేమం కోసం సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటుందన్నారు. అంధుల ఆరాధ్యదైవం అయినటువంటి లూయిస్ బ్రెయిలీ 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ లో ఆవిష్కరించినట్లు చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బ్రెయిల్ విగ్రహాన్ని అవిష్కరించాలన్న మీ కోరికను పరిగణలోకి తీసుకుని త్వరలో చర్యలు చేపట్టే విధంగా సంబంధిత శాఖ అధికారులను అదేశిస్తామని ఆయన అన్నారు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా నా సోదర సోదరీమణులు బ్రెయిల్ జయంతి వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానిస్తున్నప్పటికి రాలేకపోయానని కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రావాలని అనుకుని రావడం జరిగిందన్నారు. ఆయా బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్న వారి కోరికను పరిగణనలోకి తీసుకుని చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.... లూయిస్ బ్రెయిలీ 214వ జయంతి పురస్కరించుకుని రక్తదానం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. హనుమకొండలో కార్యాలయం కావాలన్న మీ కోరిక మేరకు కార్యాలయం కూడా అందించామని చెప్పారు. అలాగే వచ్చే లూయిస్ బ్రెయిలీ జయంతి వరకు హనుమకొండలో ఆయన విగ్రహం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అంధులకు ప్రపంచం అంధకారం అయినప్పటికీ, బ్రెయిల్ రూపొందించిన లిపితో ప్రపంచాన్ని జయిస్తున్నారని ఆయన అన్నారు. సామాన్య మనుషుల వలే అంధులు సైతం విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, క్రీడా రంగాల్లో రాణించడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు.
చైర్మన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో వికలాంగులంటే చాలా చిన్న చూపు ఉండేదని.. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వికలాంగులకు అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. కోట్ల రూపాయలతో ఉపకరణాలను కూడా అంధించడం జరిగిందని ఆయన అన్నారు. అంధుల ఆరాధ్యదైవం బ్రెయిల్ 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్లో ఘనంగా ఏర్పాటు చేసుకుని ప్రతి జయంతికి నివాళులు అర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, సి.డబ్ల్యు.సి అధ్యక్షురాలు అనితారెడ్డి, కార్యక్రమ అధ్యక్షులు కృష్ణ, ఉమ్మడి జిల్లా నుండి విచ్చేసిన అంధులు తదితరులు పాల్గొన్నారు.