Kamareddy: వాగులో చిక్కుకున్న 200 మంది కూలీలు, సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు
Kamareddy: భారీ వర్షాలకు సంతాయిపేట్ గ్రామ శివారులోని భీమేశ్వర వాగు ఉధృతి పెరగడంతో ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం వాగు అవతలి వైపు వెళ్లిన రైతు కూలీలు అక్కడే చిక్కుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా వాగులు, కాలువలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. వరదలో ఏకంగా 200 మంది కూలీలు చిక్కుకుపోయారు. సమాచారం అందుకొని అధికారులు వెంటనే స్పందించి వారందరినీ కాపాడారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మధ్యాహ్నం సమయంలో తాడ్వాయి మండలం ఏర్రపహడ్, దేమే గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు సంతాయిపేట్ గ్రామ శివారులోని భీమేశ్వర వాగు ఉధృతి పెరగడంతో ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం వాగు అవతలి వైపు వెళ్లిన రైతు కూలీలు అక్కడే చిక్కుకున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం సుమారు రెండు వందల మంది సంతాయిపేట్, చిట్యాల గ్రామాలకు చెందిన రైతు కూలీలు అక్కడే చిక్కుకుపోయారు.
అవతలి వైపు చిక్కుకున్న రైతు కూలీలను ఇక్కడి ఒడ్డుకు చేర్చేందుకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్, కామారెడ్డి అదనపు ఎస్పీ అన్యోన్య, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు, రిస్కు టీమ్ లు సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సహయంతో మొత్తం మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సుమారు నాలుగు గంటలు శ్రమించి సుమారు రెండు వందల మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అంతకు ముందు పోలీసు అధికారులు, గ్రామస్థుల సహకారంతో ఆహారం, నీటి బాటిళ్లను ప్రజలకు అందజేశారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ వరద ప్రవాహం ప్రతి ఏడాది లాగానే మామూలుగా కాకుండా మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు భీమేశ్వర వాగు ఉదృతంగా ప్రవహించిన సందర్భంగా మంత్రి కేటీఆర్, స్థానిక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ నుండి హూటావుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఇక్కడి పరిస్థితిని సమీక్షించారు. జేసీబీలో అవతలి ఒడ్డుకు చేరుకుని రైతులందరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్పించారు. అప్పటికే సంఘటన స్థలానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకుని రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారని తెలిపారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఎమ్మెల్యే సురేందర్ వచ్చి తమను సురక్షితంగా ఒడ్డుకు తరలించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.