Kamareddy: కాంగ్రెస్ లో వర్గపోరు - టిక్కెట్ల గురించి మాట్లాడే హక్కు షబ్బీర్ అలీకి లేదన్న మదన్ మోహన్
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బైటపడింది. మాజీ మంత్రి షబ్బీర్ వ్యాఖ్యలపై ఆ పార్టీకే చెందిన నేత మదన్ మోహన్ కౌంటర్ కౌంటరిచ్చారు.
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. మళ్లీ హస్తం నేతల మధ్య కుస్తీ మొదలైంది. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న వర్గపోరు మళ్లీ తెరపైకి వచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలోనే జిల్లాకు చెందిన ఇద్దరు నేతల వైరం మళ్లీ జిల్లా పాలిటిక్స్ లో టాక్ ఆఫ్ ద కామారెడ్డి గా మారింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ... మదన్ మోహన్ రావు మధ్య విబేధాలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. మొదట్నుంచీ ఈ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కుమారుడు ఇలియాస్ కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ ఓటమికి కారణం మదన్ మోహన్ రావేనని అప్పట్నుంచీ షబ్బీర్ అలీకి, మదన్ మోహన్ రావుకు ఏ మాత్రం పొసగటం లేదు. మదన్ మోహన్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఏడాది క్రితం కామారెడ్డి డీసీసీ తెలిపింది. అయితే ఈ అంశం టీపీసీసీ పరిధిలో ఉంది. గతంలో రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పాల్గొన్న రచ్చబండ కార్యక్రమంలో కూడా టీపీసీసీ చీఫ్ ఎదుటే వర్గపోరు బైటపడింది.
ఎల్లారెడ్డిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర..
ప్రస్తుతం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుండగా మరోసారి నాయకుల వర్గపోరు చర్చకు దారితీసింది. ఇంతకీ మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చిందంటే... ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆదివారం జరిగిన రేవంత్ రెడ్డి పాదయాత్రలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు తానే చూసుకుంటానని షబ్బీర్ అలీ కార్నర్ మీటింగ్ లో చెప్పటంతో మదన్ మోహన్ రావు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మదన్ మోహన్ రావు జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఆ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన ఫిక్స్ అయ్యారు. అక్కడ పార్టీ కార్యక్రమాలతో పాటు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మదన్ మోహన్ రావు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈ విధంగా ప్రకటించటంతో మదన్ మోహన్ మీడియా సమావేశం పెట్టి మరీ షబ్బీర్ అలీపై ఫైర్ అవుతున్నారు.
షబ్బీర్ వ్యాఖ్యలతో మొదలైన దుమారం..
కామారెడ్డి, ఎల్లారెడ్డి ఈ రెండు నియోజకవర్గాలు షబ్బీర్ అలీ చూస్తానని చెప్పటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు మదన్ మోహన్ రావు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ కష్టపడ్డ వాళ్ళకే టిక్కెట్ ఇస్తామని చెప్పారు. ఇలాంటివి మాట్లాడి కార్యకర్తల్ని అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు మదన్ మోహన్. ఎమ్మేల్యే టిక్కెట్లు ఎంపిక చేసే అధికారం షబ్బీర్ అలీకి లేదని అన్నారు. పేదల కోసం, పార్టీ కోసం కష్టపడే వారికే మెరిట్ ను బట్టి టిక్కెట్ ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటికే షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ తరపున కామారెడ్డి, ఎల్లారెడ్డిల్లో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏడు సార్లు ఓడిపోయారని అన్నారు మదన్ మోహన్ రావు. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉందన్న షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కుమారుడిని గెలిపించుకోకపోయాడని అన్నారు మదన్ మోహన్ రావు. ముందు షబ్బీర్ అలీ కామారెడ్డిలో గెలిచి ఎల్లారెడ్డి గురించి మాట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవడి సొత్తు కాదు కష్టపడే వారికే టిక్కెట్ వస్తుందని అన్నారు మదన్ మోహన్. గాంధారిలో షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలకు కార్యకర్తలు అధైర్య పడవద్దని అన్నారు మదన్ మోహన్.
ప్రజలు తనను నాయకునిగా వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తా.... కానీ షబ్బీర్ అలీకి మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు మదన్ మోహన్ రావు. షబ్బీర్ అలీ సీడబ్ల్యూసీ కాదు, టీపీసీసీ అధ్యక్షుడు కాదు టిక్కెట్ గురించి మాట్లాడే హక్కు షబ్బీర్ అలీ కి లేదన్నారు మదన్ మోహన్. ఏఐసీసీ ఆదేశాల మేరకు తాను ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుండి పోటీ చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతా అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ స్ట్రీట్ లో హీట్ పుట్టిస్తున్నాయి. ఓవైపు రేవంత్ రెడ్డి పాదయాత్ర జిల్లాలో జరుగుతుండగానే నేతలు ఇలాంటి కామెంట్స్ చేయటంపై కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం సృష్టిస్తోంది. మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్న దానిపై జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. మూడు సార్లు ఓడిపోయిన వారికి టిక్కెట్ ఇవ్వకూడదనే పాలసీ కాంగ్రెస్ పార్టీలో ఉంది.