(Source: ECI | ABP NEWS)
Jupally Krishna Rao: ముంపు ప్రాంతాలపై దృష్టిసారించాలి, అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లకు మంత్రి జూపల్లి ఆదేశం
Adilabad Rains | భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాలపై దృష్టిసారించాలని, ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.

Heavy Rains In Adilabad | ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తతతో పని చేయాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించిన మంత్రి, శాఖల వారీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వాయర్ల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలపై సమీక్షించి, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. చెరువులు, కాలువల్లో గండ్లు ఉంటే వెంటనే చర్యలు చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అంటు వ్యాధులు రాకుండా పారిశుద్ధ్యంపై ఫోకస్
పెన్ గంగా నది ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో అంటువ్యాధుల ప్రభావం ఉండవచ్చని హెచ్చరిస్తూ, పారిశుధ్య పనులు చేపట్టాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. RWS, హెల్త్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు.

ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటేందుకు ప్రజలు ప్రయత్నించరాదని హెచ్చరించారు. రోడ్లపై నీరు తగ్గే వరకు బయటకు రావొద్దని, అధికారులు చేపడుతున్న సహాయక చర్యలకు సహకరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలను కోరారు.
ఆదిలాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం – రాకపోకలు నిలిచిన పరిస్థితి
ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాత్నాల ప్రాజెక్టు నాలుగు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తర్ణం వాగు ఉప్పొంగి, రెండు లారీలు వాగులో మునిగిపోయాయి. భారీ వర్షాలతో వస్తున్న వరద కారణంగా ఆదిలాబాద్ నుంచి జైనథ్ బేల మండలాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు అడ గ్రామం మార్గంగా ప్రయాణిస్తున్నారు. లారీల్లో చిక్కుకున్నవారిని స్థానికులు తాళ్ల సాయంతో రక్షించారు.
టవేరా వాహనం వరదలో కొట్టుకుపోయింది
జిల్లా కేంద్రంలో కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖోజా కాలనీ వద్ద వాగు ఉధృతి పెరగడంతో టవేరా వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తి అప్రమత్తమై వాహనం వదిలి బయటకు వచ్చాడు. అయితే వాహనం మాత్రం వాగులో కొట్టుకుపోయింది. ఈ దృశ్యం స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నిర్మల్ జిల్లాలో గంగాధర్ గల్లంతు
ఇక నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు దిగువకు వదిలిన వరద నీటికి కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. చేపలు పట్టేందుకు వెళ్లిన అతను ప్రవాహానికి గురయ్యాడు. అతని కోసం NDRF బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ప్రజలకు హెచ్చరిక
ప్రవాహ తీవ్రత ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు సూచించారు.






















