Nizamabad News: రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు, ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్‌లపై చర్యలు
నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా అక్రమాలు. నిబందనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ కోట్లు ఆర్జిస్తున్న ముగ్గురు సబ్ రిజిస్ట్రార్‌లపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం
నిజామాబాద్ జిల్లాలో రిజిస్టేషన్ ఆఫీస్‌లో అక్రమాల బాగోతాలు బయటపడుతున్నాయి. జిల్లాలో భూఅక్రమ రిజిస్ర్టేషన్‌లపై ఉన్నతాధికారులు కన్నేశారు. నిబంధనలకు విరుద్దంగా భారీగా భూముల రిజిస్ట్రేషన్లకు పాల్పడిన ముగ్గురు సబ్ రిజిస్ర్టార్లపై వేటు వేశారు.
ముగ్గురిపై వేటు... మరికొందరి కోసం గాలింపు
ప్రభుత్వ భూముల మార్కెట్ వాల్యూ పెంచేందుకు నిర్ణయించగా జనవరిలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలో అనుమతులు లేని భూములకు రిజిస్ర్టేషన్‌లు చేశారు కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండికొట్టారు. శాఖాపరమైన దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ సతీష్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ సురేష్, బోధన్ సబ్ రిజిస్ట్రార్ రోహిత్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఫణిందర్‌రావు తెలిపారు.
నిబంధనలు పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్లు
రాష్ట్ర ప్రభుత్వం గతనెలలో భూముల మార్కెట్ వాల్యూ పెంచింది. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులను నిర్ధారించి ఫిబ్రవరి 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి తెచ్చింది. రేట్లు పెరుగుతాయనే సమాచారం తెలవడంతో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ పరిధిలో రిజిస్ట్రేషన్‌లు జోరందుకున్నాయి. అన్నీ సక్రమంగా ఉంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. కానీ వ్యవసాయ భూముల్లో నాలాకన్వర్షన్‌తోపాటు ఇతర అనుమతులు తీసుకోకుండా ప్లాట్లుగా చేసిన భూములను రిజిస్ట్రేషన్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు కొంతమంది ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగా ఈ దుశ్చర్యలు పాల్పడ్డట్టు తెలుస్తోంది. భారీ మొత్తంలో రిజిస్ట్రేషన్లు చేశారు. లక్షల రూపాయలను ముడుపులుగా తీసుకుని ప్రభుత్వం ఆదాయానికి భారీగా గండి కొట్టారు.
ఎప్పటి నుంచో ఆరోపణలు
ఈ భూముల రిజిస్ట్రేషన్‌లలో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించి ముగ్గురిని సస్పెండ్ చేశారు అధికారులు. ఈ మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో పనిచేసే ఉద్యోగులపైన గతంలో పలు ఆరోపణలు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. రాజకీయ నాయకుల అండదండలతో ఎలాంటి చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సాహసించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జోన్‌లు మారినా మరో చోటికి బదిలీకా లేదు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఆదాయానికే గండి కొట్టే పని జరగడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
మరికొందరిపై వేలాడుతున్న వేటుకత్తి
ఇంకా ఈ అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. అన్ని డాక్యుమెంట్‌ల పరిశీలన తర్వాత మరికొందరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి రిజిస్ట్రర్ ఫణిందర్‌రావు తెలిపారు. పెద్ద పెద్ద వెంచర్లు వేసిన రియల్టర్లకు సహకరించి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయ్. సబ్ రిజిస్ట్రార్‌లకు కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు తెలుస్తోంది.
చిత్రా మిశ్రా ఏం చేస్తారో?
ఈ బాగంతోపై అధికారులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. దీనిపై విచారణ అధికారిగా అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రాను నియమించినట్లు చెప్పారు. పట్టణ ప్రణాళిక అధికారులను విచారణ సిబ్బందిగా నియమించారు.