Telangana: కాంగ్రెస్ 14 సీట్లు గెలిస్తే, రాజకీయ సన్యాసం చేస్తా: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
Telangana News: రేవంత్ రెడ్డి ఇంకా యువనేతలా మాట్లాడుతున్నారని, ఆయన బలహీనమైన ముఖ్యమంత్రి అని BJP ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు.
I will resign if congress won 14 loksabha seats says Nirmal BJP Alleti Maheshwar Reddy- రేవంత్ రెడ్డికి జులైలో ఓటుకు నోటు కేసులో సంక్షోభం తప్పదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎల్లో పార్టీ నుండి వచ్చాడు కాబట్టి ఆగస్ట్ సంక్షోభం ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా, ముఖ్యమంత్రి తరహాలో కాకుండా కాచుకో, తేల్చుకో.. నీ బలం ఏంటి, నీ వెంట ఎంత మంది ఉన్నారంటూ యువ నేతలా మాట్లాడుతున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ బలహీనమైన ముఖ్యమంత్రి
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ‘సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా అభద్రతా భావంతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకోవాలి. ఆయన మాటల్లో పసలేకనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రేవంత్ బలహీనమైన ముఖ్యమంత్రిగా మాకు కనిపిస్తున్నారు. నీ స్థాయికి మించి ప్రధాని నరేంద్ర మోదీని విమర్శంచడం సరికాదు. ముందు జులైలో వచ్చే ఓటుకు నోటు కేసు సమస్యను ఎదుర్కోవాలి. గతంలో నీ మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై మేం చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించాలి. తెలంగాణలో వచ్చిన కొత్త ట్యాక్స్ పై త్వరలోనే మాట్లాడతాం’ అన్నారు.
చెప్పినట్లుగానే రాజకీయ సన్యాసం చేస్తా !
కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా 14 సీట్లు గెలిస్తే తాను చెప్పినట్లుగానే రాజకీయ సన్యాసం చేస్తానని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ భారీ స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాయ మాటలు, అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలని, కానీ ఇంకా అబద్ధాలు చెబుతూ వారిని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలోకి భారీగా చేరికలు
బిజెఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు కాషాయ పార్టీలో చేరారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శోభ సత్యనారాయణ గౌడ్, నిర్మల్ పట్టణ కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్ , అదుముల్ల రమా పద్మాకర్, ఏడిపెల్లి నరేందర్, మాజీ కౌన్సిలర్ పోడెల్లి గణేష్, తాజా మాజి సర్పంచ్ లు, సోన్ ఎంపీటీసీ దాసరి శ్రీనివాస్, కడ్తాల్ సర్పంచ్ బర్మ నర్సయ్య , బొరిగం సర్పంచ్ రాజారెడ్డి, BRS పార్టీ గ్రామ అధ్యక్షులు శానం గంగాధర్, ఎంపీటీసీ లు,పలువురు మండల నాయకులు శనివారం నాడు (ఏప్రిల్ 20న) బీజేపీలో చేరారు.