అన్వేషించండి
Advertisement
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై మాజీ మంత్రి ఆవేదన- సీఎం జగన్‌కు లేఖ
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై మాజీ మంత్రి మండవ అవేదన. జగన్ తీసుకున్న నిర్ణయం సరి కాదు. గతంలో రాజకీయ నేతలను చూశా ఎవరూ మీలా చేయలేద అంటూ సీఎం జగన్ కు లేఖ రాశారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మనోవేధనకు గురయ్యారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఎవరూ హర్షించరు అని అన్నారు. దీనిపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జగన్‌కు లెటర్ రాశారు.
లెటర్‌లో తనను తాను పరిచయం చేసుకున్న మండవ వెంకటేశ్వరరావు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 దఫాలు మంత్రిగా పని చేశానని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇలాంటి లేఖ రాయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. కానీ, ఇటీవల మీరు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును మార్పు చేస్తూ తీసుకొన్న నిర్ణయంపై ఆవేదనను, బాధను వ్యక్తం చేయడానికి ఈ లేఖ రాస్తున్నానని వివరించారు.
ఇంకా ఆ లేఖలో ఏముంది అంటే... మూడున్నర దశాబ్దాలుపైగా రాజకీయ అనుభవంలో ఎంతోమంది గొప్ప నాయకుల్ని చూశాను. కొందరితో కలిసి పని చేశాను. మరికొందరి ఔన్నత్యం గురించి విని ఉన్నాను. రాజకీయపరమైన విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ పరస్పరం గౌరవించుకోవడం, ఎవరి సిద్ధాంతాలు, విధానాలు వారు అనుసరించుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడం, ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో నెలకొల్పబడిన అత్యున్నత సంప్రదాయాలను కొనసాగించడం తమ విద్యుక్త ధర్మంగా రాజకీయ నాయకులు భావిస్తూ వస్తున్నారు.
గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రు, అటల్ బిహారీ వాజ్‌పేయీ రాజకీయంగా విభేదించుకొన్నప్పటికీ, ప్రధానమంత్రిగా వాయ్‌పేయీని పని చేసిన కాలంలో ఆయన కార్యాలయంలో మాజీ ప్రధానిగా పండిట్ నెహ్రు చిత్రపటం తొలగిస్తే దానిని పెట్టించి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. చరిత్రలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు.
అంతెందుకు.. మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి క్యాబినెట్‌లో మంత్రులుగా ఉండగానే.. కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్, జలగం వెంగళరావు పార్క్, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, ఆయన విగ్రహం, కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియం మొదలైనవి ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రులకు గౌరవం కల్పించడం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సైతం ఈ పేర్లను మార్చకపోవడం గమనార్హం. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ట్యాంక్బండ్‌పై ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం అయినప్పటికీ తిరిగి వాటిని పునరుద్ధరించి ఆ మహనీయుల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడటం జరిగింది.
మీరు జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఒక జిల్లాకు 'ఎన్టీఆర్' పేరు పెట్టినపుడు అందరం సంతోషించాం. ఎందుకంటే, ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా ఆయన తెలుగు ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తారు. ఆయనకు మతం, ప్రాంతం, కులం లేదు. పేద ప్రజల అభ్యున్నతే పరమావధిగా అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొన్నారు. పేదలకు పక్కా గృహాలు, కిలో రూ.2 బియ్యం, బీసీలకు రిజర్వేషన్లు, మహిళలకు ఆస్థిహక్కు, గురుకులాల ఏర్పాటు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఏకగవాక్ష విధానం, రైతులకు పలు రాయితీలు వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకొన్న మహనీయుడాయన.
వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మెడికల్ కాలేజీలలో క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక ప్రజారోగ్య కేంద్రం (పిహెచ్సీ) ఏర్పాటు చేశారు. వైద్య విద్య కోసం ఒక ప్రత్యేక విశ్వ విద్యాలయం నెలకొల్పాలనే ఆలోచన చేసి ఈ విశ్వ విద్యాలయం నెలకొల్పి దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచారు.
ఇలా ఎన్నో మార్పులకు, సంస్కరణలకు, అభివృద్ధి పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు ఆధ్యుడైన ఎన్టీఆర్ గారి పేరిట ఉన్న వైద్య విశ్వ విద్యాలయం రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో దాదాపు 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విశ్వ విద్యాలయం పేరును మార్చాలనుకోలేదు. పైగా, మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం అనే పేరు ముందు డాక్టర్' అనే పదాన్ని జోడిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.
హఠాత్తుగా మీరు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం యావత్ తెలుగు సమాజాన్ని నివ్వెర పర్చింది. ఇందుకు మీరు ఎన్ని కారణాలు చెప్పినా అవేవీ ప్రజలను సంతృప్తి పర్చలేవు. ఎన్టీఆర్ పేరు తొలగింపుతో అత్యున్నత సంప్రదాయాలను కాలరాసినట్లయింది. అధికారం మారినప్పుడల్లా పాలకులు తమ ఇష్టానుసారం ఆయా సంస్థలకు ఉన్న పేర్లు తొలగించి కొత్త పేర్లను తగిలించే చెడు సంప్రదాయానికి తెరలేపినట్లయింది. ఇది ఎంతవరకు సమంజసం? సమర్ధనీయం? ఆలోచించండి.
వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలైనపుడు చంద్రబాబునాయుడు, మేము వెంటనే వెళ్లి శ్రద్ధాంజలి ఘటించాం. అంతకుముందు 2003లో అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై దాడి జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుపతి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. హెూదాలు మారినా వారి మధ్య చక్కని స్నేహ సంబంధాలు కొనసాగేవి. సంప్రదాయాలు పాటించినపుడు, విలువలు నెలకొల్పినపుడు రాజకీయ వైరుధ్యాలు లెక్కలోనికి రావు. సమాజాన్ని అభివృద్ధి చేయడమేకాక.. సమాజాన్ని ఉన్నతీకరించడం కూడా రాజకీయాల లక్ష్యం కావాలి.
మీరు తీసుకొన్న అనాలోచిత నిర్ణయం పర్యవసానాలు సమాజంలో విపరీత పరిణామాలకు దారితీస్తాయి. పేరు మార్పు వల్ల ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులకు అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఒకరు పునాది వేస్తారు. వేరొకరు మొదలుపెడతారు. ఇంకొకరొచ్చి దానిని ప్రారంభిస్తారు. ప్రభుత్వం అన్నది ఓ నిరంతర ప్రక్రియ. ఇవన్నీ మీకు తెలియనివి కావు. అందుకే విజ్ఞత ప్రదర్శించండి. హెల్త్ యూనివర్సిటీకి తొలగించిన ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించండి.
అని జగన్ కు రాసిన లేఖలో మాజి మంత్రి మండవ పేర్కొన్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
రాజమండ్రి
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion