Nizamabad News: అకాల వర్షంతో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం- క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని రేవంత్ డిమాండ్
అకాల వర్షంతో రాష్ట్రంలో 5లక్షల ఎకరాల్లో పంట నష్టం. మామిడి, మొక్కజొన్న,ఇతర పంటలు. దెబ్బతిన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం అందించాలి. కాంగ్రెస్ హయాంలో నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకుంది
అకాల వర్షంతో రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మామిడి, మొక్కజొన్న, ఇతర పంటలు అకాల వర్షానికి బాగా దెబ్బతిన్నాయన్నారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పంటల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కామారెడ్డి జిల్లా పాదయాత్రలో భాగంగా అంకోల్ గ్రామంలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. సహకార కేంద్ర బ్యాంకులో రుణాలు తీసుకున్నాం తమను బ్యాంకు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డబ్బులు లేకుంటే ఇంట్లోంచి ల్యాప్ టాప్ తీసుకెళ్లారని ఓ రైతు బాధను రేవంత్ రెడ్డికి తెలిపాడు. రాష్ట్రంలో నష్టపోయిన పంటల నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించి పరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో రైతులకు పంట నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, పనిముట్లకు సబ్సిడీ ఇవ్వడం లేదని అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎకరాకు 40వేల వరకు సాయం అందించిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులపట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు రేవంత్. కేసీఆర్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని నీరుగార్చిందన్నారు. ఫసల్ బీమా పథకం రాష్ట్రంలో అమలు కావడంలేదన్నారు. దీంతో ఇలాంటి సమయంలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. పంటల బీమా పథకం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
2021లో బాన్సువాడ నియోజకవర్గంలో ఒకే మండలంలో 8 వేల ఎకరాల పంట నష్టం జరిగింది. 15 నెలలుగా రైతులకు పరిహారం అందించలేదు. వరి పంటకు ఒక బస్తాకు 5 కిలోలు తరుగు తీస్తూ రైతులను నిండా దోచుకుంటున్నారని విమర్శించారు. పోచారం కొడుకులు అచ్చొసిన ఆంబోతుల్లా ఊరుమీద పడి తిరుగుతున్నారు. కేసీఆర్ సావాస దోషంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా మారిపోయారని అన్నారు రేవంత్ రెడ్డి. పోచారం తన ఇంటి పేరు పైసల శ్రీనివాస్ గా మార్చుకున్నారని ఆరోపించారు రేవంత్. తండ్రీ కొడుకులు నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని..... తక్షణమే ప్రభుత్వం ఎకరాకు రూ.15వేలు పంట నష్టం వెంటనే రైతులకు అందించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహాలుగా మారారు. పంట నష్టం జరిగి రైతులు బాధపడుతుంటే బీజేపీ నేతలు ఎందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించడం లేదని ప్రశ్నించారు రేవంత్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని అన్నారు. కేంద్రం తక్షణమే బృందాలను పంపి ఇన్ పుట్ సబ్సిడీ అందించాలి. 2021 లో జరిగిన పంట నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులను వెంటనే ఆదుకోవాలి. రైతు బీమా కాదు.. పంట బీమా పథకం కేసీఆర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్. రైతు చనిపోతేనే డబ్బులు ఇస్తానంటున్న కేసీఆర్ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. రైతు ఆత్మహత్యలన్నీ కేసీఆర్ ప్రభుత్వ హత్యలే ఆరోపించారు రేవంత్ రెడ్డి. తక్షమే రాష్ట్రంలో పంట నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు రేవంత్ రెడ్డి.