Nizamabad News: మహారాష్ట్రలో క్వింటా పసుపు రూ.12 వేలు, తెలంగాణలో .7 వేలు| ఎందుకీ తేడా?
దుంపకుళ్లతో నష్టపోతున్నారు పసుపురైతులు. ఇలా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ
నిజామాబాద్(Nizamabad) జిల్లా మార్కెట్‌లో పసుపు ధర తగ్గుతూ వస్తోంది. సరైన మద్దతు ధర లేక పసుపు రైతుకు గిట్టుబాటు కావటంలేదు. ఆకాల వర్షాలతో పసుపు దిగుబడి తగ్గింది. దుంపకుళ్ల తెగలతో పసుపు పాడైంది. ఓవైపు మద్దతు ధర లేక మరోవైపు నష్టపోయిన పసుపు నష్టపరిహారం చెల్లించటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ నిజామాబాద్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా(BJP Kisan Morcha) నాయకులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో నిరసన తెలిపారు. పసుపు రైతుల పరిస్థితిని అడిగితెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేస్తే నష్టపోయిన రైతులకు పరిహారం అందేదని అన్నారు కిసాన్ మోర్చా నాయకులు. పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పసుపు రైతులను పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రైతులకు సరైన మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఎకరాకు లక్షా 60 వేల రూపాయలు ఖర్చు అవుతుంటే మద్దతు ధర క్వింటాకు కేవలం రూ.5 వేల నుంచి రూ.7 వేల పలుకుతోందని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు. ఈ ధరతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు.
మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో క్వింటా పసుపు రూ.12 వేలు పలుకుతుంటే తెలంగాణలో మాత్రం కేవలం రూ.7 వేలు మాత్రమే పలుకుతోందన్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి పసుపు రైతు కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోవటం లేదని విమర్శించారు. కనీసం మద్దతు ధర ఇవ్వటంలో కూడా చర్యలు తీసుకోవటం లేదని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు అంటున్నారు. ఎంపీ అరవింద్ స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం తేవటం వల్లే పసుపు కరుక్మిన్ యంత్రాలు వచ్చాయ్. గతేడాది మద్దతు ధర వచ్చిందని తెలిపారు.
తగ్గుతున్న పసుపు ధర
అకాల వర్షాల కారణంగా పసుపు దిగుబడులు తగ్గాయ్. మార్కెట్ పసుపు నిల్వలు తగ్గిపోయాయ్. పసుపు తక్కువగా వస్తే ధర పెరగాలి. కానీ గత వారానికి ప్రస్తుతం ధరలో వెయ్యి రూపాయలు తగ్గింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల కింద నిజామాబాద్ మార్కెట్‌లో పసుపు కొమ్ముకు రూ. 4 వేల నుంచి రూ. 6 వేలు ధర పలుకుతోంది. గత సీజన్‌తో పోల్చితే ఈ ఏడాది ధర తగ్గుతూ వస్తోంది. క్వింటాకు రూ.7 వేలకు మించి ధర రావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపునకు డిమాండ్ భారీగా ఉన్నా... నిజామాబాద్ మార్కెట్‌లో మాత్రం పసుపు ధర పెరగటం లేదని అంటున్నారు. పసుపు సాగు 9 నెలల కాలం ఉంటుంది. గతంలో 50 వేల ఎకరాల్లో పసుపు పండించే వారు. పెట్టుబడి పెరిగింది. మద్దతు ధర మాత్రం రావటంలేదు. దీంతో ఈ సారి 15 వేల ఎకరాల్లో పసుపు వీస్తీర్ణం తగ్గిపోయింది. ఇకనైనా ప్రభుత్వం పసుపునకు మద్దతు ధర వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు.