Bandi Sanjay Padayatra: బైంసా మనదే, పచ్చ జెండాకు ఎగిరే అవకాశమే ఇవ్వం: నిర్మల్ లో బండి సంజయ్
బీజేపీ కార్యకర్తలు దమ్మేంటో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలీదా?, టైం, డేట్, ప్లేస్ చెప్పి మరీ... పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ జరిపి, మనమేంటో చూపించాం అన్నారు.
బైంసా(మహిషా) మనదేనని, పచ్చ(ఎంఐఎం) జెండాకు ఎక్కడా ఎగిరే అవకాశమే ఇవ్వం బిడ్డా.. రానున్న రోజుల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో తాను నడుస్తున్నా... నడిపిస్తున్నది మాత్రం పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డినే అని, మీలో జోష్ చూసిన తర్వాత, నిర్మల్ సంగతేందో చూద్దామనిపిస్తుంది అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం చౌరస్తాలో బండి సంజయ్ ప్రసంగించారు. బీజేపీ కార్యకర్తలు దమ్మేంటో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలీదా?, టైం, డేట్, ప్లేస్ చెప్పి మరీ... పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ జరిపి, మనమేంటో చూపించాం అన్నారు.
ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయాల్నా ? వద్దా?
తెలంగాణ సీఎం కేసీఆర్ బిడ్డ లక్ష కోట్లు పెట్టి, ఢిల్లీలో లిక్కర్ దందా చేసిందని.. కనుక సీఎం కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయాల్నా ? వద్దా? అన్నారు. కవితకు నోటీస్ రాగానే... trs కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా టైర్లు కాలబెట్టాలి అంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా తెచ్చిన 317 జీవో కు వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్లిన, కానీ దందాలు చేసి బండి సంజయ్ జైలుకు పోలేదు.. దేశం కోసం, ధర్మం కోసం, నా హిందూ సమాజం కోసమే జైలుకుపోయిన అన్నారు బండి సంజయ్. కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేస్తారంటే మళ్లీ ఉద్యమం చేయాలంట? కేసీఆర్ ను ఎవరూ కాపడలేరు. కేంద్రంలో ఉన్నది అవినీతిపరులను జైళ్లకు పంపే నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నారు.
‘నిజాయితీగా పనిచేసే ఏ ఒక్క వ్యాపారస్తులపైన అయినా సిబిఐ, ఈడి దాడులు జరిగాయా?. అవినీతికి పాల్పడే వాళ్లపై దాడులు చేయాలా... వద్దా?. పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రను అడ్డుకునేందుకు పర్మిషన్ల పేరుతో ఇబ్బంది పెడుతుంటే కోర్టు ద్వారా అనుమతి తీసుకుని పాదయాత్ర చేస్తున్నాం. కోర్టుల ద్వారా అనుమతి తీసుకుని పాదయాత్ర చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖూనీ అవుతుందో ప్రజలు ఒకసారి గమనించాలి. గడీల పాలనను అంతం చేయడానికి బిజెపి ముందుకొచ్చింది. నమ్మి రాష్ట్రాన్ని అప్పజెప్పితే, తెలంగాణను దివాళా తీసి, ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడు. నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.
రైతు రుణమాఫీ చేయడు. రైతుబంధు పేరుతో రైతులకు రావాల్సిన అన్ని సబ్సిడీలను ఎత్తేశాడు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నాడు. విద్యార్థులకు పొమ్మనలేక పొగ పెడుతున్నాడు. స్కావెంజర్లను తీసేసిండు. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులకుప్పగా మార్చిండు. 4వ తారీఖు వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ నెత్తిపైనా లక్ష రూపాయల అప్పు పెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఎద్దేవా చేశారు.
‘కేంద్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లాకు వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద భారీ ఎత్తున నిధులను మంజూరు చేసిందన్నారు. 'అంబేద్కర్ ప్రాణహిత - చేవెళ్ల' ప్రాజెక్టు పేరును మార్చి, కాళేశ్వరం ప్రాజెక్టు పేరును తెరమీదకు తెచ్చారు. అంబేద్కర్ పేరు ఇష్టం లేకనే ఆ ప్రాజెక్టు పేరును మార్చిండు. వరదలకు కాళేశ్వరం పంపులను ముంచి, 1000 కోట్లు నష్టం తెచ్చిండు కేసీఆర్. ఇక్కడి కంత్రి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంగతి పక్కా చూస్తాం. అవినీతి సొమ్మును పక్కా కక్కిస్తాం. ఇక్కడ భూములు, చెరువులను కబ్జా చేసింది ఎవరో మీకు తెలుసు. జనవరి 10 లోపు మున్సిపల్ కార్మికుల దగ్గర తీసుకున్న డబ్బులను వాళ్లకి తిరిగి ఇవ్వకపోతే బిజెపి చేసే పోరాటాన్ని మీరు తట్టుకోలేరు అని’ బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.