Bandi Sanjay About KCR: నా గురువు కేసీఆర్ కు రక్షణ కల్పించండి - అమిత్ షా సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
BJP Jana Garjana Sabha At Adilabad: సీఎం కేసీఆర్ తనకు గురువు అని, గత కొన్ని రోజులుగా ఆయన కనిపించడం లేదని.. రక్షణ కల్పించాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కోరారు.
BJP Jana Garjana Sabha At Adilabad:
నిజాం మెడలు వంచి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. నేడు కేసీఆర్ లాంటి నిజాం మెడలు వంచటానికి వచ్చిన అభినవ సర్దార్ అమిత్ షా అని పేర్కొన్నారు. అమిత్ షా పాల్గొన్న జన గర్జన సభలో కరీంనగర్ ఎంపీ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా తన గురువు కేసీఆర్ కనిపించడం లేదని, ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు.
సీఎం కేసీఆర్ తనకు గురువు అని, ఆయన నుంచి తాను భాష నేర్చుకున్నానని చెప్పారు. గత కొన్నిరోజులుగా తన గురువు కేసీఆర్ కనిపించడం లేదని, ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు. కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలని, ఆయనను తమకు చూపించాలన్నారు. కేసీఆర్ ను ఆయన కుమారుడు కేటీఆర్ ఏం చేస్తున్నారోనని భయం భయంగా ఉందన్నారు. ఏ వ్యక్తి నాశనాన్ని బీజేపీ కోరుకోదని, సర్వేజనా సుఖినోభవంతు అనేది మన ధర్మమన్నారు. వచ్చేది మోదీ రాజ్యమని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరు అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. గిరిజనులకు పట్టాలు ఇస్తే, వారికి 12 శాతం రిజర్వేషన్లు ఇస్తే బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు. ఒకటో తేదీన జీతాలు, ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లు సరిగ్గా చేస్తే వాళ్లకు ఓటు వేయాలన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే, రైతులకు న్యాయం చేస్తే, మహిళలపై అత్యాచారాలు అడ్డుకునే దమ్ముంటే ఆ పార్టీకి ఓటు వేయాలన్నారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల జీతాలు ఆగమయ్యాయి. నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్ వాయిదాల వాయిదాల మీద పడుతున్నాయి. మిగతా ఎగ్జామ్ ల ఫలితాలు రాలేదన్నారు. మోదీ డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ తీసుకుని తమ పేరు ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. బీసీ నేత కనుకనే మోదీపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. భైంసాలో పీడీ యాక్ట్ పెట్టి ఎంతో మందిని వేధించడం నిజం కాదా అని ప్రశ్నించారు. భైంసాలో విధ్వంసం చేసిన వాళ్లను బజార్లో కొట్టాలన్నారు.
ఓటు వేసేముందు ఒక్కసారి ఆలోచించాలని, లేకపోతే ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి అధికారాన్ని పంచుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఆదిలాబాద్ లో 5 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అమిత్ షా ధీమాగా ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు ఏ మేలు జరగలేదన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో కేవలం సీఎం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, వారు మాత్రమే బాగు పడ్డారని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్..
గత పదేళ్లుగా కేసీఆర్ తన కుటుంబం కోసమే పని చేశారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేశామని సీఎం కేసీఆర్ చెబుతుంటారని, రైతుల ఆత్మహత్యల విషయంలో, అవినీతి విషయంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 కేసీఆర్ చేశారని అన్నారు. కేసీఆర్ ఎన్నికల గుర్తు కారు కానీ, ఆ కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ దగ్గర ఉంటుందని ఎద్దేవా చేశారు.