Jainoor 144 Section: జైనూర్ మండల కేంద్రంలో ఆంక్షలు ఎత్తివేత, 144 సెక్షన్ సడలింపు
Telangana News | మత ఘర్షణల కారణంగా కొన్ని రోజుల కింద విధించిన 144 సెక్షన్ ను జైనూరు మండల కేంద్రంలో సడలించారు. ఈ మేరకు ఆసిఫాబాద్ ఎస్పీ నిర్ణయాన్ని వెల్లడించారు.
Asifabad News in Telugu | ఆసిఫాబాద్: చాలా రోజుల తరువాత జైనూరులో ఆంక్షలు ఎత్తివేశారు. జైనూరు మండల కేంద్రంలో సెక్షన్ 144 CrPC/ 163 BNSS లో సడలింపు ఇస్తున్నట్టు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కన్నారు. విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకొని వారికోసం జైనూర్ మండల కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెక్షన్144 CrPC/163 BNSS లో సడలింపు ఇచ్చినట్టు తెలియజేశారు.
గత నెలలో చెలరేగిన ఘర్షణల కారణంగా జైనూర్ మండల కేంద్రంలో 144 సెక్షన్ విధించారు. ప్రజల వినతుల మేరకు, వారి పిల్లల చదువుల సౌకర్యార్థం 144 సెక్షన్ లో సడలింపు ఇస్తున్నట్టు జిల్లా ఎస్పీ తెలియజేశారు. మిగతా సమయాలలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎవరైనా ర్యాలీలు, ధర్నా లాంటివి చేస్తే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే శాంతియుత మార్గం ద్వారా పోలీసులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. కానీ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు నివాళులు
అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం చౌక్ నుండి వినాయక్ చౌక్ వరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మరియు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం జిల్లా పోలీసు అధికారులతో కలిసి భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా ప్రజలు, ఔత్సాహికులు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను నినాదాలు చేస్తూ, స్మరించుకుంటూ ఈ ర్యాలీ కొనసాగింది.
హాస్పిటల్ నుంచి ఆదివాసీ మహిళ డిశ్చార్జ్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆదివాసీ మహిళ రెండు వారాల కిందట కోలుకుంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన మహిళ కోలుకోవడంతో కొన్ని రోజుల కిందట డిశ్చార్జ్ చేశారు. మంత్రి సీతక్క ఆదివాసీ మహిళకు చీర ఇచ్చి, కొంచెం నగదు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ, డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు మంత్రి సీతక్క వెంట వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. వాహనం ఏర్పాటు చేసి స్వగ్రామానికి బాధితురాలిని పంపించారు. ఏం అవసరం వచ్చినా, అన్ని విధాలుగా ఆ మహిళను ఆదుకుంటామన్నారు.
Also Read: Telangana Jobs: బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న రేవంత్ రెడ్డి - అన్ని లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు