Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లా నాయకుల మెడకు డిజిటల్ మైక్రో ఫైనాన్స్ మెసాల ఉచ్చు- క్రిష్ణాతో ఫొటోలు దిగిన నాయకులపై ఆరోపణలు
Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలను ముంచిన డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ పెట్టిన జవాదే క్రిష్ణాతో ఫొటోలు దిగిన నేతలు ఇబ్బంది పడుతున్నారు. సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.

Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లాలో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ పేరిట జవాదే (జాదవ్) క్రిష్ణా చేసిన మోసంపై బాధితులు ఓవైపు ఆందోళన చెందుతుంటే.. మరోవైపు రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఆఫీసులను ఏర్పాటు చేసిన క్రిష్ణా ప్రముఖులు ఫొటోలు దిగాడు. అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర రాజకీయ నాయకులతో కలిసి కార్యాలయాల ప్రారంభోత్సవాలు చేశాడు. శాలువాలతో సన్మానాలు చేశాడు. ఈ ఫోటోస్, వీడియోస్ ప్రస్తుతం జిల్లాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఉట్నూరులో ఖానాపూర్ ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన వెడ్మ ఫౌండేషన్ ఆఫీసు పక్కనే డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఆఫీసు ఏర్పాటు ఉండటంతో గందరగోళం చోటుచేసుకుంది. క్రిష్ణా ఖానాపూర్ ఎమ్మెల్యే మిత్రుడు అంటూ ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మాట్లాడే వీడియోలు కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ మూడు పార్టీల కార్యకర్తలు సైతం క్రిష్ణాతో ఆయా పార్టీల నేతలు దిగిన ఫోటోలు వీడియోలను ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ వైరల్ చేస్తున్నారు.


డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థకు వెడ్మ ఫౌండేషన్ కు సంబంధం లేదని పోలీసులను ఆశ్రయించారు ఆ సంస్థ సిబ్బంది. ఖానాపూర్ ఎమ్మెల్యే, వెడ్మ ఫౌండేషన్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల పోలీస్ స్టేషన్లలో వేడ్మ ఫౌండేషన్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.

డిజిటల్ మైక్రో ఫైనాన్స్ మోసం వ్యహారంలో అనవసరంగా కొందరు పని గట్టుకొని ఖానాపూర్ ఎమ్మెల్యేను, వెడ్మ ఫౌండేషన్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని రెయిసెంటర్ ఆదివాసీ నాయకులు అన్నారు. శుక్రవారం ఉట్నూర్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. "మైక్రోఫైనాన్స్ చైర్మన్ క్రిష్ణాకు, వెద్మ ఫౌండేషన్‌కు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా ఎమ్మెల్యే, వెడ్మ ఫౌండేషన్ పేరును అప్రతిష్టపాలు చేస్తు సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారికి తగిన బుద్ధి చెబుతాం. మైక్రోఫైనాన్స్ చైర్మన్ కృష్ణతో మిత్రుత్వం ఉన్న మాత్రాన ఆయన చేసే చట్ట వ్యతిరేక పనులకు ఎలాంటి మద్దతు ఉండదు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. మైక్రోఫైనాన్స్ చైర్మన్ కృష్ణను నాలుగు నెలల క్రితమే ఎమ్మెల్యే పక్కన పెట్టారు, ఆయనను క్యాంప్ ఆఫీస్ వద్దకు రావద్దని హెచ్చరించారు. ఆయన జన్మదిన వేడుక సభ తర్వాత నుంచి అయనకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధాలు లేవు.డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యాలయం ప్రారంభోత్సవానికి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వెళ్లి కారక్రమాల్లో పాల్గొన్నరు. కానీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. కృష్ణ వ్యవహార శైలిలో వచ్చిన మార్పును గమనించి అతన్ని పక్కన పెట్టారు. అంతే కానీ కొందరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలనీ, అనవసర నిందలు మోపితే సహించేది లేదు" అని అన్నారు.

నిరుద్యోగులను మోసం చేసిన క్రిష్ణా ను అరెస్ట్ చేయాలి: బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రితేష్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ఆశలు చూపి ఉద్యోగాలు ఇస్తామని కోట్ల రూపాయలు దండుకొని పరారైన డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఛైర్మన్ క్రిష్ణాను వెంటనే అరెస్టు చేయాలని బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ డిమాండ్ చేశారు.ఉట్నూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..." జిల్లా కేంద్రంతోపాటు ఉట్నూరు, జైనూర్‌లో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మేనేజర్లు, డైరెక్టర్లు, క్లర్కులు లాంటి ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. కొంతమంది ఉద్యోగుల నుంచి కూడా భారీగా డబ్బులు వసూలు చేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన క్రిష్ణాపై కఠిన చర్యలు తీసుకోవాలి. అమాయక గిరిజన నిరుద్యోగులను మోసం చేయడానికి వలసవాదులు వస్తున్నారు. సేవ పేరుతో దోపిడీలకు పాల్పడుతున్నారు. వారిపట్ల పోలీస్ అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలి. మోసపూరిత మాటలను నమ్మి డబ్బులు ఊరికే వస్తాయని ప్రజలు భ్రమ పడవద్దు. నాలుగు కోట్ల నుంచి 10 కోట్ల వరకు వసూళ్లకు పాల్పడి పరారైన క్రిష్ణా పై వెంటనే చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు.





















