Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
ఆదిలాబాద్ అబ్బాయి.. మయన్మార్ అమ్మాయి వివాహం చేసుకున్నారు. ఈ వివాహంతో ప్రేమకు ఎల్లలు లేవని మరోసారి నిరూపించారు ఈ ప్రేమికులు.
Adilabad youth ties the knot with Myanmar bride: ప్రపంచంలో ఎవరికి ఎవరు ఎప్పుడు, ఎందుకు పరిచయమవుతారో తెలియదు. ఆ పరిచయంతో స్నేహం ఏర్పడి వారి మధ్య ఎప్పుడు ప్రేమ పుడుతుందో చెప్పలేము. ఇప్పటికే రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి.. అసలు ఎల్లలు లేకుండా వివాహాలు చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లి, ఉద్యోగాలు చేస్తూ ప్రేమలో పడి ఆ తర్వాత ఆ ప్రేమను పెళ్లి వరకు నడిపించిన ప్రేమికులు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఆదిలాబాద్ అబ్బాయి.. మయన్మార్ అమ్మాయి వివాహం చేసుకున్నారు. ఈ వివాహంతో ప్రేమకు ఎల్లలు లేవని మరోసారి నిరూపించారు ఈ ప్రేమికులు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలానికి చెందిన అబ్బాయి, మయన్మార్ కు చెందిన అమ్మాయికి పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది.
చర్చిలో సోమవారం వివాహం
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన రవికుమార్ కు మయన్మార్ కు చెందిన కేథరిన్ కు చింతగూడలోని చర్చిలో సోమవారం వివాహం జరిగింది. చింతగూడకు చెందిన గొల్లపల్లి రవి కుమార్, మయన్మార్ కు చెందిన కేథరీన్ ల వివాహం క్రైస్తవ సంప్రదాయ ప్రకారం ఆనందోత్సహాల నడుమ ఘనంగా జరిగింది. పెద్దల సమక్షంలో వివాహం జరిపినాక నూతన వధూవరులను పెద్దలు ఆశీర్వదించారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం చింతగూడకు చెందిన రవి కుమార్ ఆరేళ్ల కిందట జీవనోపాధి కోసం ఖతార్ దేశానికి వెళ్లాడు. దోహా నగరంలో హోటల్ మేనేజ్మెంట్ లో పని చేస్తున్న సమయంలో మయన్మార్ లోని జిన్ న్వేథేన్ కు చెందిన కేథరీన్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇరువురు కలిసి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ఇరువురు తమ కుటుంబ సభ్యులకు తెలుపగా.. ఇక వీరి ప్రేమ వివాహానికి వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో పెద్దలంతా కలిసి వారి వివాహాన్ని జరిపించారు.
చింతగూడలోని సెయింట్ థామస్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం సోమవారం జరిగింది. ఈ వివాహానికి అమ్మాయి తరఫున ఆమె సోదరుడు క్యాహు థియేన్ హాజరుకాగా.. వరుడి తరఫున బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. చర్చిలో ఫాదర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వివాహం జరిపించారు. నూతన వధూవరులను చర్చి ఫాదర్ తో పాటు కుటుంబ సభ్యులు, పెద్దలు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ వివాహ అనంతరం అందరూ కలిసి విందు భోజనం చేశారు. ఈ జంటలను చూసేందుకు స్థానికులు తరలి వచ్చి ఆసక్తిగా తిలకించారు.
ఆదిలాబాద్ అబ్బాయికి అమెరికా అమ్మాయితో పెళ్లి
అమెరికా అమ్మాయికి ఆదిలాబాద్ అబ్బాయికి జోడీ కుదిరింది. ఇద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం గత ఏడాది అక్టోబర్ నెలలో ఘనంగా పెళ్లి జరిగింది. హైదరాబాద్ లోని అలంక్రిత రిసార్ట్ లో అంగరంగ వైభవంగా అతిథుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. ఆదిలాబాద్ కు చెందిన దేవిదాస్ - కళావతి దంపతుల పెద్ద కుమారుడు అభినయ్ రెడ్డి, అమెరికాకు చెందిన టేలర్ డయానా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లగా పని చేస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు పెళ్లికి హాజరయ్యారు. అమ్మాయి తరఫు బంధువులు హిందూ సంప్రదాయాలను అమితంగా ఇష్టపడుతున్నారు. భారతీయ వంటకాలు, సంస్కృతి పట్ల చాలా ఇష్టంగా ఉన్నారు. కాగా అబ్బాయి తండ్రి పోలీస్ శాఖలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రేమ వివాహం పట్ల ఇరువురి కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి.