Tomato Lorry Overturned: టమాటా లారీ బోల్తా పడిందని ఎగబడిన జనాలు! సెక్యూరిటీ చూసి షాక్ - అయినా భారీ నష్టం
Adilabad Tomato Lorry Overturned : ఆదిలాబాద్ లో టమాటా లోడ్ తో ఉన్న లారీ రోడ్డుపై బోల్తాపడి కనపడితే జనాలు గుమిగూడారు. కానీ పోలీసుల్ని చూసి ఖాళీ చేతులతో వెళ్లిపోయారు.
Adilabad Tomato Lorry Overturned : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం టమాటాకు భారీ డిమాండ్ పెరిగింది. అనేక రాష్ట్రాలలోనీ మార్కెట్ లో టమాటా కిలో దాదాపుగా 150 నుంచి రూ.250 పలుకుతోంది. త్వరలోనే రూ. 300 దాటిపోతుందని సైతం అంచనా వేశారు. అలాంటిది టమాటా లోడ్ తో ఉన్న లారీ రోడ్డుపై బోల్తాపడి కనపడితే జనాలు ఊరుకుంటారా..? ఎత్తుకెళ్లిపోదాం అని వచ్చారు. కానీ సీన్ చూసి, తమ పప్పులుడకవని ఖాళీ చేతులతోనే వెళ్ళిపోయారు. తాజాగా అలాంటి ఘటనే అదిలాబాద్ జిల్లాలో జరిగింది.
టమాటా లోడ్ లారీ బోల్తా.. ఎగబడ్డ జనాలు !
జాతీయ రహదారిపై శనివారం టమాటా లోడ్ తో వెలుతున్న లారీ ఓ కారును తప్పించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. లారీ డ్రైవర్, క్లీనర్ చాక చక్యంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరగా మావల చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ఈ టమాటా లారీ బోల్తా కొట్టడంతో అందులోని టమాటాలను చూసిన స్ధానికులు టమాటాల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. యజమాని, లారీ డ్రైవర్, క్లీనర్ అప్పటికే పోలీసులకు సమాచారం అందించడంతో పాటు సహాయం కోరారు. దాంతో హుటాహటీన అక్కడకు చేరుకున్న పోలీసులు జనాలను చెదరగొట్టారు. టమాటాల కోసం తండోపతండాలుగా తరలి వచ్చిన జనం పోలీసులను చూసి ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లి పోయారు. టమాటాలు ఎత్తుకెళ్లకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. హైవే పెట్రోలింగ్ పోలీస్ సిబ్బంది ప్రత్యేక పైలట్ వాహనంతో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ నుండి ఢిల్లీకి లారీలో టమాటా లోడ్ తీసుకెళుతుండగా ఆదిలాబాద్ జిల్లా మావల చౌరస్తా సమీపంలో ఓ కారు ను తప్పించబోయి లారీ బోల్తా పడింది. యజమాని తో పాటు డ్రైవర్ , క్లినర్ లు కింద పడిన టమాటా క్యారెట్ లను సరిచేస్తున్నారు. ఈ లారీలో ఉన్న టమాటా విలువ మొత్తం సుమారుగా 22లక్షలు ఉంటుందని, ఇందులో సగం టమాటా లోడ్ డ్యామేజ్ కావడం జరిగిందని, 8 నుండి 10లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని, మిగతా టమాటా ను నాగ్ పూర్ నుండి తమ వేరే వాహనంలో ఢిల్లీ కి తీసుకెళ్ళి మార్కెట్ లో అమ్ముతామని వారు abp తో తెలిపారు.
టమాటా లారీ లోడ్ వద్ద పోలీసుల బందోబస్తు
అటు పోలీసులు మేషిన్ గన్ లతో ఈ టమాటా కు సెక్యూరిటీగా నిలిచారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాటా కు భారీ ధర ఉండడంతో డిమాండ్ పెరిగింది కావున జనాలు టమాటాల కొసం ఎగబడకుండా వారికి నష్టం వాటిల్లకుండా బందోబస్తు ఏర్పాటు చేసి వారికీ రక్షణగా నిలిచామన్నారు. మొత్తానికి టమాటాకు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండడంతో టమాటా పెరు చెబితేనే అందరు ఉలిక్కపడుతున్నారు. ప్రమాదం కారణంగా టమాటా సగం లోడ్ దెబ్బతిని యజమానికి భారీగానే నష్టం వాటిల్లడం విచారకరం.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial