Adilabad News: వంట కార్మికురాలి కొడుకు సివిల్స్‌లో 410వ ర్యాంకర్ - అదరగొట్టిన దళిత బిడ్డ
Adilabad News: అతనో గిరిజన యువకుడు. తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. తల్లి వంట కార్మికురాలిగా పని చేస్తూ కుమారుడిని చదివించుకుంది. ఈక్రమంలోనే అతడు సివిల్స్ లో 410వ ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచాడు.
Adilabad News: అతనో మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన యువకుడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. తల్లి వంట కార్మికురాలిగా పని చేస్తూ.. ఇతడితో పాటు అతని అన్నని, చెల్లిని కూడా కష్టపడి చదివించింది. అయితే తల్లి కష్టాన్ని గమనించిన చిన్న కుమారుడు.. బాగా చదివాడు. సివిల్స్ లో 410వ ర్యాంకు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
తండ్రి చిన్నప్పుడే చనిపోగా, తల్లి వంట పని చేస్తూ..
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్(2022) ఫలితాల్లో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని తుంగెడ గ్రామానికి చెందిన దళితబిడ్డ డోంగ్రి రేవయ్య ఆలిండియా స్థాయిలో 410వ ర్యాంక్ సాధించాడు. విస్తారుబాయి - మనోహర్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో ఇద్దరు కుమారులు, ఒక కూతురు. తండ్రి మనోహర్ చిన్నతనంలోనే చనిపోగా.. తల్లి విస్తారుబాయి తుంగెడలోని ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పనులు చేస్తూ ముగ్గురు పిల్లలను ఉన్నత చదువులు చదివించింది. కూతురు స్వప్న నాగపూర్ ఎన్ఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. పెద్ద కుమారుడు శ్రవణ్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో కుమారుడు డోంగ్రి రేవయ్య చిన్నతనం నుంచి బంధువుల ఇంట్లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగించాడు.
Also Read: కోచింగ్ లేకుండా 35వ ర్యాంకు - సివిల్స్ లో సత్తా చాటిన గిరిజన విద్యార్థి
410వ ర్యాంకు సాధించి, సత్తా చాటిన గిరిజన యువకుడు
ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు కాగజ్ నగర్ లోని శిశుమందిర్ పాఠశాలలో.. 5 నుంచి 10వ తరగతి వరకు ఆసిఫాబాద్ లోని సోషల్ వెల్పేర్ గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్ లోని నాగోల్ లో గల సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. జేఈఈ ఎంట్రెన్స్ రాసి మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. బీటెక్ పూర్తి చేసిన అనంతరం ఓఎన్జీసీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. ర్యాంకు సాధించాలనే తపనతో ఉద్యోగం వదిలేసి పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యాడు. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్ష రాయగా మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ఆల్ ఇండియా స్థాయిలో 410వ ర్యాంక్ సాధించాడు. మారుమూల గ్రామమైన తుంగెడ నుంచి సివిల్ సర్వీసెస్ లో ర్యాంక్ సాధించడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కన్నతల్లి కష్టానికి ప్రతిఫలం అందించడంతో ఆమె చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) మే 23న సివిల్ సర్వీసెస్ పరీక్ష (UPSC CSE 2022) తుది ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో యూపీకి చెందిన ఇషితా కిశోర్ అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో బిహార్‌కు చెందిన గరిమా లోహియా రెండో స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణకు చెందిన ఎన్ ఉమా హారతి మూడో స్థానం కైవసం చేసుకుంది. యూపీకి చెందిన స్మృతి మిశ్రా నాలుగో స్థానంలో నిలవగా.. అసోంకి చెందిన మయూర్ హజారికా ఐదో స్థానం, కొట్టాయంకు చెందిన గెహనా నవ్య జేమ్స్ ఆరోస్థానం దక్కించుకున్నారు.
మొదటి 4 ర్యాంకులు అమ్మాయిలవే..
సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో అమ్మాయిలు మరోసారి సత్తాచాటారు. మొదటి నాలుగు ర్యాంకులను అమ్మాయిలే సాధించడం విశేషం. వీరిలో ఇషితా కిశోర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో మెరవగా.. గరిమ లోహియా, ఉమా హారతి ఎన్. స్మృతి మిశ్రా తర్వాతి నాలుగు ర్యాంకుల్లో నిలిచి సత్తాచాటారు.
సివిల్స్ టాపర్‌గా ఇషితా కిశోర్..
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇషిత కిషోర్.. సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో టాపర్‌గా నిలిచింది. ఇషిత తన మూడో ప్రయత్నంలోనే విజయం సాధించారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమినరీ పరీక్ష కూడా అర్హత సాధించలేకపోంది. అయితే మూడో ప్రయత్నంలో మాత్రం ఏకంగా ఇంటర్వ్యూ వరకు వెళ్లి, సివిల్స్ టాపర్‌గా నిలవడం విశేషం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తొలి ర్యాంకు సాధించడం పట్ల ఇషిత కిషోర్ తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా వ్యక్తం చేశారు. అయితే సివిల్స్‌లో క్వాలిఫై అవుతాననే ధీమా ముందు నుంచే ఉందన్న ఇషితా.. కానీ తొలి ర్యాంకు వస్తుందని అసలు ఊహించలేదని తెలిపారు.
Also Read: నిజామాబాద్ జిల్లా వాసులు ఇద్దరికి సివిల్స్‌లో ర్యాంక్లు- లైన్‌మెన్ కుమారుడికి 200 వ ర్యాంక్