Bandi Sanjay : తప్పు చేయకపోతే 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ సూటి ప్రశ్న!
Bandi Sanjay : బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు వణుకు వస్తుందని బండి సంజయ్ అన్నారు. నిర్మల్ లో బుల్డోజర్లను దింపి కబ్జా చేసి కట్టిన భవంతులను నేలమట్టం చేస్తామన్నారు.
Bandi Sanjay : బీజేపీ అధికారంలోకి రాగానే నిర్మల్ జిల్లాలో బుల్డోజర్లను దించుతామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కబ్జా జాగాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో కేసీఆర్ సర్కార్ పై మరోసారి ఫైర్ అయ్యారు బండి సంజయ్. ‘‘సోయం బాపూరావు గాలిలో గెలిచిండట. అవును గాలిలో గెలిచిండు కాబట్టే ఏమీ సంపాదించుకోలేదు. మరి నువ్వు భూమి మీద గెలిచినవ్ కదా... అందుకే భూములన్నీ కబ్జా చేస్తున్నవా అల్లకల్లోల రెడ్డి... మా బాపన్న సంపాదించిన ఆస్తులన్నీ ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధం... మరి నీ ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు సిద్ధమా?’’అంటూ బండి సంజయ్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సవాల్ విసిరారు. పేదలను హింసించిన భూకబ్జాదారులను, అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ల అంతు చూస్తామన్నారు. నిర్మల్ లో బుల్డోజర్లను దింపి భూకబ్జాలు చేసి కట్టుకున్న భవంతులను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. కొండగట్టు మృతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, నష్టపరిహారం ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పి నాలుగేళ్లయిందన్నారు. సీఎం ఆ హామీని అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మామ్డ మండల కేంద్రంలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏ తప్పు చేయకపోతే ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలు ఎక్కడ దాడులు చేసినా కవిత పేరే బయటికి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణకు 2,40,000 ఇండ్లను మోదీ మంజూరు చేశారని, మోదీ మంజూరు చేసిన ఇండ్లలో కేసీఆర్ ఎన్ని ఇండ్లను కట్టించారని నిలదీశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం, మోదీ 4 వేల కోట్ల రూపాయలను తెలంగాణకు ఇచ్చారని తెలిపారు. మంత్రి కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే అంటూ మండిపడ్డారు. బీజేపీ టీఆర్ఎస్ నేతలు గజగజ వణుకుతున్నారన్నారు. ప్రధాని మోదీ ఒక్కరోజే లక్ష 46 వేల ఉద్యోగాలను ఇచ్చారని తెలిపారు. సంవత్సరంలో పది లక్షల ఉద్యోగాలను ఇవ్వబోతున్నారన్నారు. కేసీఆర్ ఒక్క రైతుబంధు ఇచ్చి, రైతులకు రావలసిన అన్ని సబ్సిడీలను ఎత్తేశారని ఆరోపించారు. రైతులకు సబ్సిడీపై ఎరువులను ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే అని తెలిపారు. ఒక్క ఎకరానికి, ఒక్క పంటకు... 30 వేల రూపాయల సబ్సిడీని అన్నదాతలకు మోదీ ప్రభుత్వం అందించిందన్నారు.
తెలంగాణలో అభివృద్ధి కేంద్రం నిధులతోనే
"రైతన్నలకు సబ్సిడీపై ఎరువులను ఇస్తున్న మోదీ గొప్పోడా? అన్ని సబ్సిడీలను బంద్ చేసిన కేసీఆర్ గొప్పోడా? సన్నవడ్లు, దొడ్డువడ్లు అంటూ... రైతులను కేసీఆర్ ఆగం చేసిండు. భూసార పరీక్షలను నిర్వహించి, ఎప్పుడు ఏ పంటలు వేయాలో చెప్పాల్సిన ఇక్కడి కలెక్టర్ ఏం చేస్తున్నారు?. రైతులను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఎంతమంది పోడు భూముల సమస్యను పరిష్కరించారు? తండాలను గ్రామ పంచాయతీలుగా చేశానన్న కేసీఆర్... పంచాయతీలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మామ్డా మండలానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద... భారీగా నిధులను మంజూరు చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడట. ఎప్పుడైనా మామ్డ మండల కేంద్రానికి కేసీఆర్ వచ్చారా? ఎన్నికలు వచ్చేటప్పుడే కేసీఆర్ బయటికి వస్తాడు. ఓట్ల కోసమో.. సీట్ల కోసమో మేము రాలేదు. ప్రజల కోసమే... సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నా. ఐకే రెడ్డి... జీకే రెడ్డి అంటూ ఏమీ చూడం. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కబ్జాలు చేసిన జాగాలను గుంజుతాం. అవినీతిపరులకు మినహాయింపు ఉండదు. మాకు జైళ్లు, లాఠీ దెబ్బలు కొత్తేం కాదు. పోలీసులకు జీతాలు ఇవ్వకుండా... పోలీసులపై ఒత్తిడి పెంచి, బలవంతంగా చలాన్లు రాయిపిస్తున్నారు. పోలీసులకు ప్రమోషన్లు లేవు. పోలీసు వ్యవస్థకు బీజేపీ వ్యతిరేకం కాదు. " -బండి సంజయ్