YS Sharmila: రేవంత్ బ్లాక్ మెయిలర్, ఆయన్ని జనం నమ్మరు - ఈ పని చేస్తే బెటర్: షర్మిల ఘాటు వ్యాఖ్యలు
YS Sharmila Padayatra: ఉమ్మడి నల్గొండ జిల్లాలో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె వరి రైతులను కలిశారు.
YS Sharmila on Revanth: టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డి పైనా వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని వాళ్ల పార్టీ వాళ్లే చెబుతున్నారని అన్నారు. ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ దొంగ అని, అలాంటి వ్యక్తిని పార్టీ చీఫ్ గా పెడితే ప్రజలు నమ్మబోరని షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు. వరంగల్ రాహుల్ గాంధీ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తే అప్పుడు రైతులకు పార్టీపై నమ్మకం కలుగుతుందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఉండబోదని రాహుల్ గాంధీ చెప్పుకునే స్థాయికి ఆ పార్టీ పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రజలంతా ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని జోరుగా భావిస్తుండటం వల్లే రాహుల్ గాంధీ ఇలా చెప్పుకోవాల్సి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ - టీఆర్ఎస్ రాజకీయాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని షర్మిల అన్నారు.
ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె వరి రైతులను కలిశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా పరిశీలించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని షర్మిల విమర్శించారు.
ఆ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు విని వరి సాగు చేయక కొందరు నష్టపోతే, పంట వేసిన వాళ్లు కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుల సంక్షేమం అని చెప్పుకునే కేసీఆర్, గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని అడిగారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటున్నవారు రైతులకు బోనస్ ఇవ్వలేరా ఇని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటికి వచ్చి, తమతో పాటు వస్తే అన్నదాతల కష్టాలు చూపిస్తామని షర్మిల అన్నారు. కేసీఆర్ మత్తు వీడితేనే రైతుల కష్టాలు తీరతాయని అన్నారు.
వరి వేయని వారికి నష్టపరిహారం ఇవ్వాలి - షర్మిల
‘‘కేసీఆర్ మాటలకు రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట వేయకుండా నష్టపోయారు. ఈ రైతులకు కేసీఆర్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌కు బ్యాంకుల్లో రూ.800 కోట్లకు పైగా నిధులు ఉన్నాయని కేసీఆర్ ప్రకటించారు. ఈ నిధుల్లో నుండి వరి పండించని రైతులకు పరిహారం చెల్లించాలి. ఎకరానికి రూ.30 వేల చొప్పున ఇవ్వాలి. వరి వేసుకున్న రైతులకు ఉరే అని కేసీఆర్ చెప్పారు. కానీ ప్రస్తుతం వరి వేసిన రైతుల నుండి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటోంది
వరికి క్వింటాల్ కి రూ.1,960 ధరను ఇకరిద్దరికి ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. తాలు, తేమ, నాసిరకం ధాన్యం అంటూ మద్దతు ధరను ఇవ్వడం లేదు. రైతుల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఉదారంగా ఖర్చు పెట్టడం లేదు. వరి రైతులకు మద్దతు ధరతో పాటు 20 శాతం బోనస్ ను కూడా చెల్లించాలి.’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.