KCR Performs Pooja: భద్రాచలం చేరుకున్న కేసీఆర్, గోదావరి నదికి శాంతి పూజలు చేసిన సీఎం
KCR Performs pooja At Bhadrachalam: తెలంగాణ సీఎం కేసీఆర్ గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నదికి శాంతి పూజలు నిర్వహించారు.ర
KCR performs pooja At Bhadrachalam: గోదావరి నది వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం చేరుకున్నారు. వరద ప్రవాహం తగ్గాలని, ఇకనైనా శాంతించవమ్మా అంటూ గోదావరికి ప్రత్యేక శాంతి పూజలు నిర్వహించారు కేసీఆర్. పర్యటనలో తన వెంట ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి గోదావరి బ్రిడ్జిని సైతం కేసీఆర్ పరిశీలించారు. గోదావరి ప్రవాహాన్ని వంతెన పైనుంచి కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
కరకట్ట పరిశీలనకు సీఎం కేసీఆర్..
వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. కరకట్ట వద్ద నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించి, వారి పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. వారికి అధికారుల నుంచి అందుతున్న సహకారం, పునరావాస ఏర్పాట్లపై ఆరా తీస్తారు. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు అందుతున్న వైద్యం, తదితర సహాయ కార్యక్రమాలను తెలుసుకుంటారు. ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి తల్లికి శాంతి పూజ నిర్వహించిన సీఎం శ్రీ కేసీఆర్. pic.twitter.com/E8V3EZ4vya
— TRS Party (@trspartyonline) July 17, 2022
అంతకుముందు నేడు భద్రాచలం పర్యటనకు సీఎం కేసీఆర్ వర్షంలోనే బయలుదేరారు. ములుగు, ఏటూరునాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటూ భారీ వర్షంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ తో సహా ప్రయాణిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారుల బృందం మరి కాసేపట్లో భద్రాచలానికి చేరుకోనున్నారు. అక్కడ ముంపుకు గురైన ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.
వర్షం కురుస్తున్నా పర్యటనలో ముందుకు..
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నా, వాతావరణం అనుకూలించలేదు. దీంతో సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో ఏటూరునాగారం బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఎగుర రాష్ట్రాల నుంచి వరదతో గోదావరి ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల కారణంగా చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. కానీ వర్షం కారణంగా రోడ్డు మార్గంలోనే వరద ప్రాంతాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ సర్వేలో సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు పాల్గొననున్నారు.
పినపాకలో గవర్నర్ తమిళిసై పర్యటన..
పినపాక నియోజకవర్గంలో ఈ రోజు అశ్వాపురం మండలంలోని పాములపల్లి, చింతిర్యాల, వరద ముంపు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై పర్యటిస్తున్నారు. జూన్ 16 న రాత్రి 11.45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయలుదేరి నేడు ఉదయం 5 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. నేటి ఉదయం నుంచి గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో బాధితులను ఆమె పరామర్శిస్తున్నారు. సహాయ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.