Munugode Bypolls: మునుగోడులో పోటాపోటీగా టీఆర్ఎస్, బీజేపీ సభలు - ఈ 30న కేసీఆర్, 31న నడ్డా మీటింగ్
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం దాదాపు క్లైమాక్స్ కు చేరడంతో కీలక నేతలు బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు మిగిలి ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు వేగం పెంచాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ అయితే మంత్రులను, ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటివరకూ ప్రచారం ఓ మోస్తరుగా జరిగింది. దీపావళి పండుగ రావడంతో రెండు రోజులు సొంతూళ్లకు వెళ్లారు నేతలు. సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు మునుగోడులో క్లైమాక్స్ ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 30న చండూరు మున్సిపాలిటి పరిధిలోని బంగారిగడ్డ వద్ద సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రచారం మరో రెండు రోజుల్లో ముగుస్తుందనగా కేసీఆర్ ప్రచారం చేస్తే పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు.
మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ
తెలంగాణలో అధికారం కోసం ఎదురుచూస్తున్న కమలనాథులు అక్టోబర్ 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ఎంపీ లక్ష్మణ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలు బీజేపీ నిర్వహించనున్న సభకు హాజరవుతారని సమాచారం. ఇదంతా చూస్తే ఆగస్టులో సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆగస్టు 21న సీఎం కేసీఆర్ మునుగోడులో సభ నిర్వహించారు. ఆ మరుసటిరోజు ఆగస్టు 22న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడి బహిరంగ సభలో పాల్గొన్నారు. తాజాగా మరోసారి కేసీఆర్ సభలో పాల్గొన్న తరువాత మరుసటి రోజే జేపీ నడ్డా బీజేపీ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. దీపావళి పండుగ సమయంలోనూ నియోజకవర్గంలోనే ఉండి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్థితులను పర్యవేక్షించారు. నడ్డా పాల్గొననున్న సభకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించే ప్రయత్నాల్లో పార్టీ నేతలు బిజీగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ సభపై క్లారిటీ వచ్చేనా !
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మునుగోడులో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశాయి. కానీ అదే సమయంలో తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర కారణంగా పార్టీ కీలక నేతలు మునుగోడులో సభను ఫిక్స్ చేయలేదు. అయితే మునుగోడు నియోజకవర్గ ముఖ్య నేతలు రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబరు 1న శంషాబాద్ సమీపంలో సభ ఏర్పాటు చేసి మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ ప్రచారం చేయనుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ముందు మునుగోడు నుంచే మొదలుపెట్టాల్సి ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా బాగా తెలుసు. కాంగ్రెస్ నేతలు త్వరలోనే సభపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇటీవల రాజగోపాల్ రెడ్డి, పాల్వాయి స్రవంతి సభలలో రాళ్ల దాడి, చెప్పు దాడులు జరగడంతో నేతల మధ్య గొడవలు పెరిగాయి. ఈ సమయంలో కేసీఆర్, జేపీ నడ్డా లాంటి కీలక నేతలు పాల్గొననున్న టీఆర్ఎస్, బీజేపీ సభలకు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు కొన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్ లను ఏర్పాటు చేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని చర్యలు చేపట్టారు.