(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పింఛన్ 4 వేలు ఇస్తాం: ఖమ్మం సభలో రాహుల్ ప్రకటన
Rahul Gandhi Comments At Khammam Meeting: వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలుచేశారు.
Rahul Gandhi Comments At Khammam Meeting: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. 'చేయూత' పేరుతో కాంగ్రెస్ గ్యారంటీ.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా/ డయాలసిస్ పేషంట్లకు ప్రతీ నెలా రూ.4,000 పింఛను అందిస్తామని హామీ ఇచ్చారు.
ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. 9 ఏళ్లపాటు మొత్తం అవినీతి చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. 9 ఏళ్లపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం మీ కలల్ని నాశనం చేసింది. ఇప్పుడు చూస్తే వాళ్ల పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. బీజేపీకి బంధువుల సమితి పార్టీగా సీఎం కేసీఆర్ పేరు మార్చేశారని సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ. తాను రాజు అని భావించి, ఇది తనకు సొంతమైన భూమిగా కేసీఆర్ భావిస్తారన్నారు. సీఎం కేసీఆర్ దళితులు, ఆదివాసీలు, పేదల భూములు లాక్కుంటున్నారని.. భూముల విషయంపై భారత్ జోడో యాత్రలో భాగంగా మీరు నా ద్రుష్టికి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ భూములు మీవి, మీ హక్కు.. కాంగ్రెస్ పార్టీ ఈ భూములపై మీకు హక్కు కల్పించిందన్నారు.
ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయల అవినీతి
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర సమయంలో ధరణి పోర్టల్ ద్వారా మీకు జరిగిన అన్యాయం, సీఎం అవినీతిని ప్రజలకు తనకు చెప్పుకున్నారని రాహుల్ అన్నారు. మిషన్ భగీరథతో వేల కోట్లు దోచుకున్నారు. అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. దళితులు, పేదలు, రైతులు, ఆదివాదీలు, యువతను కేసీఆర్ మోసం చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే.. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్.. బీజేపీకి బీ పార్టీగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతుల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు పలికింది.
బీజేపీకి బీ పార్టీ బీఆర్ఎస్.. రాహుల్
ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ అందుకు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోదీ చేతిలో ఉంది. కాంగ్రెస్ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించింది. ఆ తరువాత హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ ప్రకటించడం మంచి పరిణామం అన్నారు. పింఛన్ రూ.4 వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోడు భూములను ఆదివాసీలకు పంపిణీ చేస్తాం. కర్ణాటకలో ఇలా అవినీతి ప్రభుత్వం ఉంటే, ఎన్నికల్లో కాంగ్రెస్ వారిని ఓడించిందని గుర్తు చేశారు రాహుల్ గాంధీ.
Also Read: Ponguleti Joins Congress: కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ
రాష్ట్రం ఏర్పాటయ్యాక బాగు పడింది కేవలం సీఎం కేసీఆర్ ఫ్యామిలీ, ఆయన బంధువులు, సన్నిహితులు మాత్రమేనంటూ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అవినీతిని భరించలేక రైతులు, దళితులు, మహిళలు, యువత, చిరు వ్యాపారులు కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, ఆ పోరాటాన్ని అలాగే కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial