Politics: ట్రెండ్ మార్చిన నేతలు - పెళ్లైనా, చావైనా సరే వదిలేదేలే - కొందరికి ఆనందం, మరికొందరికి దిక్కు తోచదు !
ఇంటికి పెద్ద నాయకుడైనా.. ఎమ్మెల్యే అయినా వస్తే ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో వారి క్రేజ్ మామూలుగా ఉండదు. కానీ దానివల్ల కొందరికి సంతోషమైతే, మరికొందరిని బాధకు గురిచేస్తున్నాయి
ఒక్కప్పుడు ఎవరి ఇంట్లోనైనా శుభాకార్యం జరిగి ఆ ఇంటికి పెద్ద నాయకుడైనా.. ఎమ్మెల్యే అయినా వస్తే ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో వారి క్రేజ్ మామూలుగా ఉండదు. వారి రాకే పెద్ద బహుమతిగా ఫీలయ్యేవారు. అయితే ఇప్పుడు నాయకులు మాత్రం ట్రెండ్ మార్చారు. శుభకార్యం కానీ.. మరోకార్యమైనా కానీ ఏది వదలడం లేదు. అటెండెన్స్ తమకు ఇంపార్టెన్స్ అన్న రేంజ్‌లోకి వెళ్లిపోయారు. వీరి రాక ఏమో కానీ జనం మాత్రం ఈ పొలిటికల్ అటెండెన్స్‌లకు షాక్‌లు కొట్టినట్లు ఫీలవుతున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే నాయకులు కనిపించడమనేది ఒకప్పటి ట్రెండ్ అయితే అలా ఉన్న వారిని తరువాత ఎన్నికల్లో లేకుండా చేస్తున్నారు ఓటర్లు.
నాయకులు ఇప్పుడు పోటీలు పడి మరి జనంతో కలవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు ఎవరిదైనా సరే ఏ కార్యక్రమైనా సరే జరుపుకుంటే అక్కడ ప్రత్యక్షం కావాల్సిందే. ప్రజల్ని కలిసేందుకు మీటింగ్‌లు పెడితే ఆర్థికంగా ఇబ్బంది.. అదే ఎవరి ఇంట్లో అయినా కార్యక్రమం చేసుకుంటే అక్కడకు వెళితే జన సమీకరణ లేకుండానే జనాల్ని కలవొచ్చు. తాము ఆ కార్యక్రమానికి హాజరయ్యామనే క్రెడిట్ కొట్టేయొచ్చు. ప్రస్తుతం నేతల తీరు ఇలాగే మారిపోయింది. వీరి వ్యూహానికి కొందరు ఆనందిస్తుండగా మరికొందరు మాత్రం వీళ్లు ఎందుకు వచ్చారా ? అనే విధంగా బాధ పడుతున్నారు. అవేమీ పట్టించుకోని నాయకులు మాత్రం పెళ్లి నుంచి కర్మకాండ తంతు వరకు.. పురుడు నుంచి బర్త్ డే వేడుకల వరకు దేనిని వదిలిపెట్టకుండా తమకు ప్లస్ చేసుకునేందుకు యత్నిస్తున్నారు.
చావు నుంచి నేరుగా పెళ్లికి..
సాధారణంగా ఏదైనా చావు లాంటి కార్యానికి వెళితే ఇంటికి వెళ్లి స్నానం చేసిన తర్వాతనే తిరిగి ఏదైనా కార్యక్రమానికి హాజరవుతుంటారు. మరీ ముఖ్యంగా శుభకార్యాలకు హాజరయ్యేందుకు ఇవి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయితే పొలిటికల్ లీడర్లు మాత్రం ఇవేమి పట్టించుకోవడం లేదు. రూట్ మ్యాప్‌లో ఉంటే చాలు అటు కర్మకాండ, దశదినకర్మలకు వెళ్లినా సరే నేరుగా పెళ్లిళ్లకు హాజరవుతున్నారు. దీంతో అక్కడున్న వారికి మనస్తాపాన్ని మిగుల్చుతున్నారు. ఎవరైనా శుభకార్యం చేస్తే వారి బంధు మిత్రులకు సరిపడా అంచనాలతో భోజనాలు సిద్దం చేస్తారు. కానీ రాజకీయ నాయకుల రాకతో వారి అంచనాలు తలకిందులవుతున్నాయి. నేతలతో పాటు పాటు సెక్యూరిటీ, పాలోవర్స్ ఏదైనా 50 నుంచి వంద మందికి వస్తారు. దీంతో నాయకులతో వచ్చే వారికి భోజనాలు పెడితే తమ అంచనాలు తలకిందులై ముందు పిలిచిన అతిధులకు భోజనాలు సరిపోవడం లేదని.. పెళ్లి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇది ఒక తలనొప్పి కాగా పార్టీలకు సంబంధం లేని వారి కార్యక్రమాలకు నాయకులు హాజరైతే గ్రామాలలో వారిని ఆ నేత అనుచరులుగా మారుస్తుండటంతో కొన్ని చోట్ల అవి వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇదిలా ఉండగా కొంత మంది కార్యక్రమాలకు హాజరై మిగతా ఇళ్లలో కార్యక్రమాలకు హాజరుకాకపోవడంతో దూరం కూడా పెంచుతుంది.
పరామర్శకు వస్తే పైసలే..
పొలిటికల్ అటెండెన్స్ ట్రెండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అది కొంత ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో నాయకులు పోటీ పడి మరీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. జిల్లాలోని ఓ ఇద్దరు నాయకులు ఏదైనా చావుకు హాజరైతే రూ.10 వేలకు తక్కువ కాకుండా అందజేస్తారనే ప్రచారం ఉంది. జనం చేసుకునే కార్యక్రమాల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కొంత మందిని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా జనం మధ్యలో ఉన్నామని చెప్పుకునేందుకు నేతలు ఇలా పెళ్లిళ్లు, కర్మకాండ, దశదినకర్మలను దేనిని వదలడం లేదు. నేతల రాక కొందరికి ఆనందాన్నిస్తుంటే, మరికొందరికి బాధను మిగిల్చుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపితే ఈ ఇబ్బందులు ఉండవని విశ్లేషకులు భావిస్తున్నారు.