Godavari Water Level: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం, స్థానికులలో నిత్యం భయాందోళన !
Rains In Telangana: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఏ క్షణంలో వరద ముప్పు పొంచి ఉంటుందా అనే అనుమానాలు వీరిలో వ్యక్తమవుతున్నాయి.
ఎగువన కురుస్తున్న వర్షాలు భద్రాద్రి వాసులను నిత్యం కలవరపెడుతున్నాయి. జూలై నెలలోనే భారీ వరదలను ఎదుర్కొన్న భద్రాచలం ప్రజలు ఇప్పుడు గోదావరి నీటిమట్టం హెచ్చుతగ్గులను చూస్తూ భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జూలై నెలలోనే రెండు సార్లు మూడో ప్రమాద హెచ్చరికను తాకిన గోదావరి మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా 71.5 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 1986లో అత్యధికంగా 75 అడుగులకు చేరుకున్న గోదావరి 36 ఏళ్ల తర్వాత అంతటి ఉగ్రరూపాన్ని చూపించింది. అయితే అప్పట్నుంచి శాంతించినట్లు కనిపిస్తున్నటికీ తరుచూ కురుస్తున్న వర్షాలకు 40 అడుగులకు మాత్రం తగ్గడం లేదు.
రెండుసార్లు మూడో ప్రమాద హెచ్చరిక..
జూలై మొదటి వారంలోనే గోదావరికి వరదల పోటు మొదలైంది. జూలై 7న ప్రారంభమైన వరద 11వ తారీఖున మూడో ప్రమాద హెచ్చరికకు చేరుకుంది. 53 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికకు చేరుకుంది. ఆ తర్వాత కాస్తా తగ్గుముఖం పట్టినట్లు అనిపించినప్పటికీ అంతలోనే వరద పెరగడం మొదలైంది. ఈ 14 తర్వాత మరింత ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. 13న మరోసారి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించిన గోదావరి 15వ తేదీ నంంచి మరింతగా పెరిగి 71 అడుగులకు చేరుకుంది. అయితే ఆ తర్వాత వరద తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజుల పాటు భద్రాచలానికి వెళ్లే రహదారులు జలదిగ్బందంలో చిక్కుపోయాయి. అప్పటి నుంచి క్రమేపి తగ్గుతున్న గోదావరి 40 అడుగులకు మాత్రం తగ్గడం లేదు.
పెరుగుతూ.. తగ్గుతూ..
ఓ వైపు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతుండటంతో గోదావరి మాత్రం నిండుగానే ప్రవహిస్తుంది. 71 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం ఆ తర్వాత వారం రోజుల తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక దిగువన ప్రవహించింది. దీంతో పది రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా మూడో ప్రమాద హెచ్చరికను తీసివేశారు. అప్పట్నుంచి వరద ఉదృత్తి కొనసాగుతుండటంతో 40 అడుగులకు సరాసరిగా ప్రవహిస్తోంది. గత రెండు రోజులుగా రెండు, మూడు అడుగుల వ్యత్యాసంలో గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది.
రాష్ట్రలో పలు జిల్లాల్లో ఈ నెలాఖరు వరకు భారీ వర్షాలు ఉంటాయని అధికారులు తెలపడంతో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో ఆ వరద మళ్లీ తమను ఇబ్బంది పెడుతుందని భద్రాద్రి వాసులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో ప్రతి రోజు ఎగువ ప్రాంతాల నంంచి భారీ వరద రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 42 అడుగులకు ఉండటం, భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో భద్రాద్రి వాసులు కలవరపడుతున్నారు. వరుణుడు కరుణించి గోదారమ్మ శాంతించాలని కోరుకుంటున్నారు.