Munugode ByElections: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసీ నోటీసులు - నేటి సాయంత్రం వరకు గడువు
కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని రాజగోపాల్ రెడ్డికి శనివారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల సమయంలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.
Komatireddy RajaGopal Reddy Gets Notice From Election Commission: హైదరాబాద్: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. మునుగోడు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి చెందిన సంస్థ నుంచి దాదాపు 5.24 కోట్ల రూపాయలను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని, ఆ డబ్బంతా ఉపఎన్నికల్లో పంపిణీ చేయడం కోసమేనని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని రాజగోపాల్ రెడ్డికి శనివారం నోటీసు జారీ చేసింది. ఈ ఫిర్యాదులోని అన్ని అంశాలపై సోమవారం సాయంత్రం 4 గంటల్లోగా సమాధానం పంపాలని రాజగోపాల్ రెడ్డిని ఈసీ ఆదేశించింది. ఎన్నికల సమయంలో ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ రాజగోపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేసి, వివరణ కోరింది.
టీఆర్ఎస్ ఆరోపణలు, ఫిర్యాదు ఇదే..
రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతా నుంచి అక్టోబర్ 14, 18, 29 తేదీలలో మునుగోడు నియోజకవర్గంలోని 22 మంది వేర్వేరు వ్యక్తుల ఖాతాకు కోట్ల రూపాయల నగదు బదిలీ అయింది. ఈ క్యాష్ విత్ డ్రా చేసి ఓటర్లకు పంచడానికి ట్రాన్స్‌ఫర్ చేశారని టీఆర్ఎస్ నేత ఎన్నికల సంఘానికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టెందుకే రాజగోపాల్ రెడ్డి ఈ నగదు బదిలీ చేయించారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవేళ ఈ నగదు మీ ఆదేశాలతో కంపెనీ బదిలీ చేసి ఉన్నట్లయితే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆ ఖాతాల్లోకి నగదు జమ చేయలేదని భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నగదు బదిలీ చేసినట్లయితే ఎన్నికల నియమావళి ప్రకారం అది అవినీతి చర్య, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనల కిందకు వస్తుందని టీఆర్ఎస్ నేతలు అన్నారు.
టీఆర్ఎస్ నేత భరత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రాజగోపాల్ రెడ్డికి నోటీసు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు గడువు ఇచ్చింది. నగదు బదిలీకి సంబంధించి పలు పత్రాలను ఈసీకి సమర్పించారు టీఆర్ఎస్ నేతలు. ఆ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేయకుందే ఆ 22 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసేలా చర్యలు తీసుకోవాలని ఈసీనీ టీఆర్ఎస్ నేత భరత్ కుమార్ కోరారు.
ఎమ్మెల్యేల కొనుగోలులో సీఎం కేసీఆర్ అడ్డంగా దొరికిపోయారని దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావు ఈడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. అయితే అధికార టీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ సైతం సుశీ ఇన్‌ఫ్రా నుంచి కోట్ల రూపాయల నగదు బదిలీపై ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను రాజగోపాల్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి కొట్టిపారేశారు. మునుగోడు ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.