Munugode By Elections: వాడు పోతుండు, వీడు పోతుండని పిచ్చి రాతలు - నిఖార్సైన వారే పార్టీలో ఉంటారన్న రఘునందన్ రావు
Munugode By Elections: మునుగోడులో గెలిచేది బీజేపీ అభ్యర్థేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాళోజీ చెప్పినట్లుగా అన్యాయం చేసినోళ్లను మునుగోడు ప్రజలు బొందపెడతారని అన్నారు.
Munugode By Elections: మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతోంది. నేతలు ఒకరికి మించి మరొకరు ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. నువ్వా - నేనా అన్నట్లుగా ప్రచార బరిలో తలపడుతున్నాయి. ఇరు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు. సవాలుకు ప్రతి సవాల్ విసురుతూ.. రాజకీయ కాక రేపుతున్నారు. రాష్ట్ర రాజకీయం అంతా ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం చుట్టూనే తిరుగుతోంది. మూడు ప్రధాన పార్టీల కీలక నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మద్దతు దారులతో మునుగోడులో రాజకీయ సమరం సాగుతోంది.
'నిఖార్సైన వారే పార్టీలో ఉంటారు'
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మునుగోడులో క్షేత్రస్థాయిలో చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మునుగోడులో యుద్ధం మొదలైందని.. మన దండు అటుపక్క ఉంటదా ఇటుపక్క ఉంటదనే పంచాయతీ నడుస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. రైతు పండించిన పంటను చాటలో పోసి ఎగబోస్తాడు.. తాను పండించిన పంటలు తాలు వెళ్లిపోతుంది ఎంత మంది పోయినా నాణ్యమైన వడ్లలాగా నిఖార్సైన వాళ్లే మిగులుతారు అని రఘునందన్ రావు అన్నారు.
'ఉడత ఊపులకు, కేసులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు '
"సోషల్ మీడియాలో వాడు పోతుండు.. వీడు పోతుండని పిచ్చి రాతలు, పిచ్చికూతలు వస్తున్నాయి. నాటి కౌరవ యుద్ధంలో వంద మంది వేసుకొని వచ్చిన దుర్యోధనుడికి ఏలాంటి శాస్తి జరిగిందో.. రేపు మునుగోడులో కూడా అదే జరగబోతుంది. కేసీఆర్ ని ఫాంహౌస్ కి కేటీఆర్ ని.. అమెరికాకి కవితక్కను ఏదో వ్యాపారం పెట్టుకుంది అంట అక్కడికి పంపివ్వడం ఖాయం. కాళోజీ చెప్పినట్టు ఈ గడ్డ మీద పుట్టినోడు ఈ గడ్డకి అన్యాయం చేస్తే ఇక్కడే బొంద పెడతామని చెప్పినట్టు అన్యాయం చేసినోన్ని ఇక్కడే బొంద పెట్టాలి. రెడీగా ఉండండి ఉడత ఊపులకు, కేసులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. పోలీసు మిత్రులు చట్టాన్ని మీరు గౌరవించండి. మేము మిమ్మల్ని గౌరవిస్తాం" అని దుబ్బాక ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు.
ఒక వకీలుగా మా యువతకు భరోసా ఇస్తున్నానని అన్నారు. "మనం అందరం కూడా యూనిఫామ్ లేని పోలీసులమే.. మేము మర్యాదగా ఉంటున్నాం.. మా సహనాన్ని మీరు చేతగానితనం అనుకుంటే ఖబడ్దార్.. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలకు ఎవరూ కూడా బేంబేలు ఎత్తొద్దు. చాలా మంది టీఆర్ఎస్ నాయకులు మాతో టచ్ లో ఉన్నారు. వాళ్ల నెంబర్లతోని మాట్లాడటం లేదు. వేరే నెంబర్లతో మాట్లాడుతున్నారు. మీరు మునుగోడు గెలిస్తే మేమే తాళాలు వేసి మీ దగ్గరికి వస్తామని చెబుతున్నారు. కొంత మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. యాజమాన్యాలు కూడా తప్పుడు ప్రచారం చేసే వాళ్లపైన కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం" అని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.