Suryapet: మోదీ, కేసీఆర్ ఇద్దరూ కోరల్లేని పాములే, వైఎస్ జగన్ నిర్ణయం చెల్లదు - సీపీఐ నారాయణ
Suryapet: ఆదానీ మోదీ దత్తపుత్రుడని, ఆయన కోసం బొగ్గును రాష్ట్రాలన్నీ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని నారాయణ ఆరోపించారు.
CPI Narayana: సీపీఐ జిల్లా మహా సభల సందర్భంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రధాని మోదీ, సీఎంలు కేసీఆర్, జగన్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. దేశంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ కోరల్లేని పాములని అభివర్ణించారు. వారు కోరలు లేని పాముల్లాగా బుసలు కొడుకుంటున్నారని, కాటు మాత్రం వేసుకోవడం లేదని నారాయణ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సీపీఐ జిల్లా మహాసభలు సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ దేశాన్ని ఇప్పటివరకు పాలించిన 14 మంది ప్రధానులు ప్రభుత్వరంగ సంస్థలను తీసుకొస్తే, ఒక్క మోదీనే 24 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన బొగ్గు వ్యవహారాన్ని కూడా సీపీఐ నారాయణ ప్రస్తావించారు. ఆదానీ మోదీ దత్తపుత్రుడని, ఆయన కోసం బొగ్గును రాష్ట్రాలన్నీ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. మరోవైపు, మంచిర్యాల జిల్లాలో ఆదివాసీ మహిళను వివస్త్రను చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించిన రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ రావును వెంటనే తెలంగాణ సర్కార్ సస్పెండ్ చేయాలని కె.నారాయణ డిమాండ్ చేశారు. మహాసభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం పల్లా వెంకట్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన నారాయణ ఆదివాసీ మహిళలపై అటవీ, పోలీస్ శాఖల దాడులను తీవ్రంగా ఖండించారు.
జగన్ ఎన్నిక చెల్లదు - నారాయణ
వైఎస్ఆర్ సీపీకి ముఖ్యమంత్రి జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని నారాయణ ఖండించారు. వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సీపీఐ నారాయణ మట్లాడుతూ, ఇది చట్ట వ్యతిరేకమని అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29 - ఏ ప్రకారం ఈ తీర్మానం చెల్లబోదని గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు ఉన్న ఏ పార్టీలో అయినా ఇంటర్నర్ డెమోక్రసీ అవసరమని చెప్పారు. ఏ పార్టీలోనైనా ఓటింగ్ ప్రక్రియ ద్వారా మాత్రమే అధ్యక్షుడిని కానీ, కార్యవర్గాన్ని కానీ ఎన్నుకోవాలని చెప్పారు. ఇదే విషయాన్ని నిబంధనలు కూడా చెపుతున్నాయని తెలిపారు. రెండు, మూడేళ్లకు ఒకసారి పార్టీలో ఎన్నికలు నిర్వహించుకోవాలని చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా సీఎం జగన్ ను వైఎస్ఆర్ సీపీకి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని సీపీఐ నారాయణ అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నిబంధనలను మార్చినప్పుడు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు.