మునుగోడులో ఎవరి బలం ఎంత- ఈ సారి ఛాన్స్ ఎవరికి ఉండొచ్చు?
మునుగోడు నియోజవర్గం పొలిటికల్ హిస్టరీ చూస్తే మాత్రం చాలా వైవిధ్యంగా కనిపిస్తుంది. నియోజవర్గం ఏర్పడినప్పటి నుంచి విజయం కాంగ్రెస్, సీపీఐ మధ్య మారుతూ వచ్చింది.
తెలంగాణలో మరో ఉపఎన్నిక వేడి రాజుకుంది. హుజూరాబాద్ ఉపఎన్నిక కాక చల్లారక ముందే మరో బైపోల్ వచ్చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలోని పార్టీలన్నీ రేపు జరిగే మనుగోడు ఉపఎన్నికపై ఫోకస్ పెట్టాయి. దీంతో అక్కడ ఎవరి బలమెంత ఎంత. ఎవరి బలహీనతలు ఏంటన్న విషయాలపై కన్నేశారు నేతలు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదంతో తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. జరిగేది ఉపఎన్నికే అయినప్పటికీ వచ్చే ఎన్నికలకు ఇదో సెమీఫైనల్‌గా పార్టీలు భావిస్తున్నాయి. అది కాంగ్రెస్ సీటు అయినప్పటికీ పోటీ బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్యే ఉంటుందన్నది ఆయా పార్టీలు చేస్తున్న విశ్లేషణ. ఇంతకీ ప్రజలు ఎవరి పట్టం కడతారో చూడాలి.
కాంగ్రెస్ ఆరు సార్లు
మునుగోడు నియోజవర్గం పొలిటికల్ హిస్టరీ చూస్తే మాత్రం చాలా వైవిధ్యంగా కనిపిస్తుంది. నియోజవర్గం ఏర్పడినప్పటి నుంచి విజయం కాంగ్రెస్, సీపీఐ మధ్య మారుతూ వచ్చింది. తెలంగాణ ఏర్పడిన జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి టీఆర్‌ఎస్ గెలిచింది. రెండోసారి కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు ఉపఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుందో అన్న తీవ్రమైన చర్చ నడుస్తోంది.
నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న మునుగోడు నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 12సార్లు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. నల్గొండ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల పోరాటాల ఖిల్లాగా ఉండేది. అందుకే ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం అత్యధికంగా కనిపిస్తుంటుంది. తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఇంతటి చరిత్ర ఉన్న నల్గొండ జిల్లాలో ఇప్పుడు మునుగోడు ఎన్నికలపై అందరి దృష్టి పడింది.
కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్యనే ఎక్కువగా పోటీ ఉండేది. సీపీఐకి చెందిన అభ్యర్ధులు ఐదుసార్లు గెలిస్తే, కాంగ్రెస్ అభ్యర్థులు ఆరుసార్లు విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించింది.
ఐదుసార్లు ఎన్నికైన పాల్వయి గోవర్థన్‌రెడ్డి
మునుగోడు నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పాల్వాయి గోవర్థన్‌రెడ్డి 1967 నుంచి వరుసగా నాలుగుసార్లు 1972, 1978, 1983లో విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత సీపీఐ అభ్యర్థి నారాయణరావు 1985, 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో నారాయణరావు విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పాల్వాయి గోవర్థన్‌రెడ్డి విజయం సాధించారు. ఐదో సార్లు ఇక్కడ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు.
2004లో జరిగిన ఎన్నికల్లో సీపీఐకి చెందిన పి.వెంకటరెడ్డి విజయం సాధించగా, 2009లో యాదగిరిరావు ప్రజలను మెప్పించారు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయాన్ని ముద్దాడారు. 2018 ఎన్నికల్లో మనుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు.
కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కు ప్రధాన పోటీ
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన 12 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంది. ఆరుసార్లు కాంగ్రెస్ పైచేయి సాధిస్తే... ఐదుసార్లు కమ్యూనిస్టులు ప్రజల మనసులు గెలుచుకున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీఆర్‌ఎస్ గెలిచింది. ఎప్పుడు కూడా బీజేపీ సీన్‌లో కనిపించలేదు. ప్రభావం కూడా చూపలేదు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని ఆ పార్టీలు విశ్లేషిస్తున్నాయి.
మునుగోడులో గత ఎన్నికల్లో ఎప్పుడూ ప్రభావం చూపని బీజేపీ... రాజగోపాల్‌రెడ్డి చేరితో కొత్త ఉత్సాహంతో దూసుకెళ్తుంది. కచ్చితంగా ఇక్కడ విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మొత్తం సీన్ మారిపోతుందని భావిస్తోందా పార్టీ. అందుకే హుజురాబాద్ ఉపఎన్నిక జరిగిన ఏడాదిలోపే మరో ఉపఎన్నికకు ప్లాన్ చేసింది. రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు ఇక్కడ గెలిస్తే ఈ జోష్‌ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కంటిన్యూ చేసి అధికారంలోకి రావాలని భారీ స్కెచ్‌తో ఉంది బీజేపీ.
ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నికల్లో ఏ పార్టీ హవా ఉంటుందా..? గత రికార్డును మార్చేసి మరో పార్టీకి ప్రజలు పట్టం కడతారా? అనే విషయంపైనే ప్రధానంగా చర్చ సాగుతుంది. మునుగోడుపై ఆరుసార్లు విజయం సాధించిన కాంగ్రెస్ సీన్‌లో లేదని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని హస్తం పార్టీ నేతలు తిప్పి కొడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అక్కడ బారీ బహిరంగ సభను పెట్టి ప్రజల ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేసింది. రాజగోపాల్‌రెడ్డి ప్రజలను మోసం చేశారని.. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతివ్యూహం రచిస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో వచ్చిన మునుగోడు ఉపఎన్నిక పార్టీలన్నింటికీ డూఆర్‌డై పరిస్థితిని తీసుకొచ్చింది. అందుకు తగ్గట్టుగానే పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలను మెప్పించడంలో తగ్గేదేలే అన్నట్టు దూసుకెళ్తున్నాయి.