Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అరెస్టు, ఏం తప్పుచేశామంటూ పోలీసులతో వాగ్వాదం
ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా వచ్చి బండి సంజయ్ అరెస్టును ఖండించారు. సంజయ్‌ను ఎందుకు అరెస్టు చేశారని పోలీసులను నిలదీశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు అనంతరం జరుగుతున్న పరిణామాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా అరెస్టు అయ్యారు. నిన్న (ఏప్రిల్ 4) అర్ధరాత్రి బండి సంజయ్‌ను కరీంనగర్ నుంచి యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించగా, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ పీఎస్‌కు చేరుకొని నిరసనలు చేశారు. బండి సంజయ్‌ను అరెస్టును ఖండిస్తూ, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈలోపు అక్కడికి ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా వచ్చి బండి సంజయ్ అరెస్టును ఖండించారు. సంజయ్‌ను ఎందుకు అరెస్టు చేశారని పోలీసులను నిలదీశారు. దీంతో అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని వెళ్లిపోవాలని రఘునందన్ రావుకు పోలీసులు సూచించారు.
ఆయన వినకుండా అక్కడే ఉండడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రఘునందన్ రావుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనను అడ్డుకున్నారని అన్నారు. బండి సంజయ్‌ను ఏ కేసులో.. ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పడం లేదని రఘునందన్ మండిపడ్డారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు పాటించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ఎంపీని కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, తప్పుదోవ పట్టించేందుకే, ప్రజల ఫోకస్ మరల్చేందుకే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని అన్నారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంజయ్ అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని, ప్రజలు త్వరలోనే ఆ పార్టీకి బుద్ధి చెబుతారని ఆమె వ్యాఖ్యానించారు. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అని కూడా చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య అని డీకే అరుణ అన్నారు.
హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ
బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అర్ధరాత్రి ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. బండి సంజయ్ ను అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. మరికాసేపట్లో బీజేపీ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. అటు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పోలీస్ స్టేషన్ ప్రధాన ద్వారాన్ని బారికేడ్లతో మూసివేశారు. బీజేపీ శ్రేణులు భారీగా వస్తున్న నేపథ్యంలో బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుంచి బండి సంజయ్‌ను తరలించే అవకాశం ఉంది. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.