Bhatti Vikramarka: యాదాద్రిలో ఆటోలను తిరిగి కొండపైకి అనుమతిస్తాం, ఆటో డ్రైవర్లకు భట్టి విక్రమార్క హామీ
Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర 48వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగానే నేడు ఆయన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
Bhatti Vikramarka: ఆరు నెలల్లో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, యాదాద్రిలో ఆటోలను తిరిగి కొండపైకి అనుమతిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక వారి అన్ని సమస్యలు తీరుస్తామన్నారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటితో 48వ రోజుకు చేరుకుంది. ఈక్రమంలోనే భట్టి విక్రమార్క బుధవారం ఉదయం యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం పాదయాత్రగా ముందుకు సాగారు.
గత 405 రోజులు నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆటో డ్రైవర్లు.. సీఎల్పీ నేత వద్దకు తమ కష్టాన్ని, బాధలను చెప్పుకున్నారు. యాదగిరి గుట్ట ఆలయాన్ని ప్రారంభించిన మరుసటి రోజు నుంచి కొండపైకి ఆటోల రాకపోకలను ఈ ప్రభుత్వం నిషేధించిందని.. దీనివల్ల తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలను కొండపైకి అనుమతించేలా చేయాలని ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు మొగులయ్య, సంతోష్, సత్యానారాయణ, ఇతర డ్రైవర్లంతా కలిసి భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేశారు.
పేద వారి శోకాల్లో అండగా నిలుస్తూ..
— Bhatti Vikramarka Mallu (@BhattiCLP) May 3, 2023
తన ఆలోచనలతో ప్రజల్లో చైతన్యం నింపుతూ...
మనందరికి కోసం కదలి వస్తున్న భట్టి అన్న ! #PeoplesMarch #MalluBhattiVikramarka #HaathSeHaathJodo #CongressParty pic.twitter.com/vBaLk9ugsl
శూలాలు పెట్టి పొడిచినా చలనం ఉండదు..
ఈ సందర్భంగా మొగులయ్య మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా కొండపైకి భక్తులను తీసుకెళ్లడంతో పాటు ఆలయ నిర్మాణ సమయంలోనూ అర్చకులకు పూర్తిగా సేవలందించామని చెప్పారు. ఆటోలను కొండపై వెళ్లకుండా నిషేధించడం వల్ల.. తమ భార్యల పుస్తెలతాడు అమ్మి కొనుక్కున్న ఆటోలకు ఫైనాన్స్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు అందరు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇదేనని వివరించారు. పిల్లల స్కూలు ఫీజులు, ఇంటి కిరాయి కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. వీరి బాధలు విని స్పందించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మీ సమస్యపై పోరాటం చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం దున్నపోతులాంటిదని.. దీనిని శూలాలు పెట్టి పొడిచినా ఫలితం రాదన్నారు. మీ సమస్యపై ఈ ప్రభుత్వం త్వరగా స్పందించాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని వేడుకుంటున్నాని అన్నారు. ఈ దున్నపోతు ప్రభుత్వం స్పందించకపోయినా.. వచ్చే ఆరు నెలల్లో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అప్పుడు అన్ని సమస్యలు తీరుస్తామన్నారు. ఆటోలను తిరిగి కొండపైకి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. సీఎల్పీ నేత ప్రకటించిన సంఘీభావం, హామీపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థి, యువత మేదస్సు పక్క దారి పడితే సమాజానికి విస్పోటనం పేలినంత ప్రమాదకరం అవుతుందని భట్టి అన్నారు. ధర్నాలు లేని తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ పరిపాలనలో ప్రతి రోజు రాష్ట్రంలో ధర్నాలు జరుగుతూనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు, ప్రశ్నాపత్రాల లీకేజీ పై నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, మహిళలు, యువత తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నాలు చేస్తూనే ఉన్నారని చెప్పారు. కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ప్రజలు సుఖంగా ఎవరూ లేరని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కుటుంబం, ప్రభుత్వ పెద్దలే సుఖంగా ఉన్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం బహుళార్థసాధక ప్రాజెక్టులు కట్టింది లేదని ఎద్దేవా చేశారు. కృష్ణ, గోదావరి నదుల నుంచి అదనంగా ఒక ఎకరానికి సాగునీరు అందించింది లేదని విమర్శించారు. పెద్ద, పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసింది లేదని చెప్పారు. రూ.18 లక్షల కోట్లు బడ్జెట్ ఖర్చు చేశారని, ఇది చాలనట్టు ఐదు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.