Bhadradri Kothagudem: కేసీఆర్ సార్ - ఎమ్మెల్యే తండ్రి, భర్త నుంచి మా భూములు కాపాడండి - బాధితుల వినూత్న నిరసన
‘కేసీఆర్‌గారు ఎమ్మెల్యే తండ్రి, భర్త నుంచి మా భూములను ఇప్పించండి.. 12 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం..’ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ కాలనీ వాసులు నిరసన చేపట్టారు.
Bhadradri Kothagudem People Requests KCR For Justice: ‘కేసీఆర్‌గారు ఎమ్మెల్యే తండ్రి, భర్త నుంచి మా భూములను ఇప్పించండి.. 12 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం..’ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ గ్రామానికి చెందిన బాధితులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యానగర్‌లో భూ మాఫియా చేస్తున్న వ్యక్తులపై విసుగు చెందిన వీరు రోడ్డెక్కడం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణానికి శివారు ప్రాంతంగా విద్యానగర్ కాలనీ ఉంది. కొత్తగూడెం జిల్లా కేంద్రం కావడంతో పట్టణానికి దగ్గరగా ఉన్న ఈ భూమి విలువ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఇక్కడ భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు జోరందుకున్నాయి. గతంలో అనేక ఏళ్ల నుంచి ఇక్కడ వివాదస్పదుడిగా మారిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ తండ్రి బాదావత్ సీతారాములు కూతురు పదవిని అడ్డుపెట్టుకుని విద్యానగర్ కాలనీలో కబ్జాలకు, సెటిల్‌మెంట్‌లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యానగర్ కాలనీలోని 137/1, 137/9 భూమిలో ఎమ్మెల్యే తండ్రి తమను వేదిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించి, ఏకంగా టెంట్ వేసి నిరసన తెలిపారు. కాగా ఈ ర్యాలీకి గ్రామ సర్పంచ్ బానోత్ గోవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ సంఘీబావం తెలపడం గమనార్హం.
ఖాళీ స్థలం కనపడితే నోటీసులు.. కోట్లలో సెటిల్‌మెంట్‌లు..
విద్యానగర్ కాలనీ ఏజెన్సీ పరిధిలో ఉంది. అయినప్పటికీ జిల్లా కేంద్రానికి శివారు ప్రాంతం కావడం, ఖమ్మం – కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ఇక్కడ భూముల విలువ భారీగానే పెరిగింది. ఈ నేపథ్యంలో ఇల్లందు ఎమ్మెల్యే తండ్రి బాదావత్ సీతారాములు ఇక్కడ ఖాళీ స్థలాలకు నోటీసులు పంపి సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై గతంలో అనేక సార్లు బాదితులు పోలీస్ స్టేషన్ వరకు పంచాయతీలు వెళ్లాయి. ఖాళీ స్థలాలకు నోటీసులు పంపి సెటిల్‌మెంట్ పేరుతో కోట్లాధి రూపాయలు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
గత 12 ఏళ్లుగా విసిగి వేసారిన బాధితులు ఇక చేసేదేమి లేక రోడ్డెక్కినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే తండ్రి, భర్త ఈ విషయంలో ఉండటంతో రెవిన్యూ, పోలీస్ అధికారులు బాధితులకు న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఓ గృహ యజమాని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకునప్పటికీ నాలుగేళ్ల వరకు స్థలంలోకి వెళ్లలేకపోయాడు. చివరకు కలెక్టర్‌కు విషయం తెలియడంతో ఎట్టకేలకు బాధితుడికి తన స్థలం చిక్కింది. వాణిజ్య పరంగా రోజురోజుకు పెరుగుతున్న విద్యానగర్ కాలనీలో భూపంచాయతీలు, సెటిల్‌మెంట్లపై అధికారులు దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని బాదితులు కోరుతున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే, తండ్రి, భర్త పేరుతో బాధితులు ర్యాలీ చేయడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది.