(Source: ECI/ABP News/ABP Majha)
Bandi Sanjay: సీఎంను చెట్టుకు కట్టేసి, ఆ నీళ్లతో స్నానం చేయించండి! రచ్చబండలో బండి సంజయ్
Musi River: మూసీ బాధిత ప్రాంతమైన భువనగిరి నియోజకవర్గం పెద్ద రావులపల్లి గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: ‘‘మూసీ నదిని రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రక్షాళన చేస్తానని, హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా మారుస్తానని హామీలిచ్చిన మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బుద్ది వచ్చేలా చేయాలి. ఈసారి మీ వద్దకొస్తే కేసీఆర్ ను చెట్టుకు కట్టేసి మూసీ నీళ్లతో స్నానం చేయించండి.. ఫినాయల్ పోసి కడగండి.. అప్పుడైనా బుద్ది వచ్చి మూసీ ప్రక్షాళన చేస్తాడేమో’’ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మూసీ బాధిత ప్రాంతమైన భువనగిరి నియోజకవర్గం పెద్ద రావులపల్లి గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
4వ రోజు సంగ్రామ యాత్రలో భాగంగా భట్టుగూడెం మీదుగా పెద్దరావులపల్లికి వచ్చిన బండి సంజయ్ స్తానిక ప్రజలతో కలిసి రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మూసీ నీటితో పడుతున్న కష్టాలను వివరించారు. మూసీ నీళ్ల వల్ల తినే తిండి కూడా కలుషితమైపోయిందని వాపోయారు. తమ ప్రాంతాల్లో పెళ్లి చేసుకుందామంటే పిల్లను కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నీళ్లతో పంటలన్నీ నాశనమవుతున్నాయని, అరోగ్యం దెబ్బతిని చావు బతుకుల మధ్య బతుకు వెళ్లదీయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు.
వారి బాధలు విన్న బండి సంజయ్ మూసీ నీళ్ల వల్ల ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నా కేసీఆర్ లో చలనం ఎందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల బాధలు వింటుంటే దు:ఖమొస్తోందని అన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
• ఎన్నికల కోసమో ఓట్ల కోసమో మేము ఇక్కడికి రాలేదు ప్రజల సమస్యలు తెలుసుకోమని మోదీ పంపితేనే ఇక్కడికి వచ్చాం. పైసలు ఇస్తే ఓట్లు వేస్తారని కేసీఆర్ భ్రమలో ఉన్నారు. ప్రజలు మూసీ కాలుష్యం వలన పంటలు, పొలాలు, ఆరోగ్యాలు ఇలా అన్ని రకాలుగా నష్టపోతున్నారు. మూసీని గోదావరి, హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్ళలా చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది? 2002 లో అద్వానీ గారు మూసీ ప్రక్షాళన కోసం రూ.344 కోట్లు కేటాయించారు.
• కేసీఆర్ వచ్చాక మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.4000 కోట్లు కేటాయిస్తాం అని అన్నారు. ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. సబర్మతి నదిని చూసి వచ్చి, మూసీ ని అలా సుందరీకరిస్తాం అన్న కేసీఆర్... ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసీఆర్ కు 300 ఎకరాల ఫార్మ్ హౌస్ ఉంది. తన ఫార్మ్ హౌస్ కు నీళ్ల కోసం 200km దూరం ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు రప్పించుకున్నాడు. అందుకు లక్షా 30వేల కోట్లు ఖర్చు చేశాడు. కేసీఆర్ ఏమో అమీర్ అవుతూ.. మిమ్మల్ని బికారోళ్ళను చేస్తున్నాడు.
• ఎండలో ఎండుతూ... వర్షంలో తడుస్తూ మీకోసం పాదయాత్ర చేస్తున్నా. వివిధ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్ల ద్వారా వేల కోట్లు లోన్లు తీసుకుని, ఆ నిధులను మింగేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఆగం చేసి, పుట్టే బిడ్డ పై కూడా లక్షా 30వేల అప్పు వేశాడు. పేదల కోసం తెలంగాణకు మోడీ 2 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే.... కేసీఆర్ వాటిని కట్టించడం లేదు. ఉచితంగా 5 కిలోల బియ్యం, ఫ్రీ వ్యాక్సిన్ మోడీ ఇస్తున్నారు. మోడీ ఇచ్చే కిలో బియ్యంపై రూపాయి చొప్పున కేసీఆర్ డబ్బులు వసూలు చేశాడు. కేసీఆర్ తన కుటుంబానికే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఉపాధిహామీ పథకం కింద రోజుకు రూ.257 మోడీ ఇస్తున్నారు... ఎండాకాలం అదనంగా రూ.20 ఇస్తున్నారు. నిధులు మోడీ ఇస్తున్నా... వాటిని కేసీఆర్ ఇక్కడ పంచడం లేదు.
• కేంద్రం నుంచి వివిధ పథకాల కింద భారీ ఎత్తున పెద్దరావులపల్లి కి నిధులను కేటాయించారు. పరిశ్రమల వ్యర్థాలను మూసీలో కలుపుతున్నారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు, రైతులు మూసీ వెదజల్లే కాలుష్యం కారణంగా.. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మూసీ నీటిని బాటిల్ లో పట్టి, కేసీఆర్ కు పంపించండి. ఈసారి ఇక్కడికి వస్తే కేసీఆర్ ను చెట్టుకు కట్టేసి మూసీ నీళ్లతో స్నానం చేయించండి...ఫినాయిల్ పోసి కడగండి... ఐరన్ బ్రష్ తో ఒంటిని రుద్దండి.. అప్పుడైనా బుద్ది వచ్చి మూసీని ప్రక్షాళన చేస్తాడేమో...మూసీ రివర్ బోర్డు కార్పొరేషన్ ఫేరు పెట్టి వేల కోట్ల రుణాల తెచ్చి ఏం చేశారో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓట్ల కోసం కేసీఆర్ ఇచ్చే నోట్లను తీసుకోండి... ఓటును మాత్రం బీజేపీ కే వేయండి. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. మూసీ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం.
Musi is poisonous, stinks and surrounding areas are inhabitable shared residents on Day4 of #PrajaSangramaYatra3 in Bhuvanagiri constituency. TRS govt is cheating people by claiming to spend hundreds of crores for cleaning & beautification of Musi, but ground reality is horrible. pic.twitter.com/8XLcq0CR46
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 5, 2022