FRO Death: ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు పాడె మోసిన మంత్రులు- అంత్యక్రియల్లో పాల్గొన్న నేతలు
FRO Srinivasa Rao Death: ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు భౌతిక కాయానికి మంత్రులు పువ్వాడ అయ్ కుమార్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు.
FRO Srinivasa Rao Death: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడు ఘటనలో మృతి చెందిన శ్రీనివాసరావు మృతదేహాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. ఆయన భౌతిక కాయానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీనివాస రావు ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఅర్.. ప్రభుత్వం తరుపున రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని చెప్పినట్లు వివరించారు. ప్రభుత్వం శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను సహించేది లేదని మంత్రులు తెలిపారు. శ్రీనివాస రావుపై దాడి చేసి, దారుణంగా హత్య చేసిన ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుందని... నిందితులను చాలా కఠినంగా శిక్షించేలా చేస్తామన్నారు.
ఎఫ్ఆర్ఓ పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ సోమేశ్ కుమార్ ను సిఎం కేసీఆర్ ఆదేశించారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు ఎఫ్ ఆర్ వో అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ క్రమంలోనే మంత్రులు, అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మంత్రులు స్వయంగా పాడె మోశారు. ప్రభుత్వ ఉద్యోగుల పై దాడులను ఏమాత్రం సహించబోమని సిీఎం స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం అండగా వుంటుందని ఎలాంటి జంకు లేకుండా తమ విధిని నిర్వర్తించాలని,ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారు.
మంత్రుల వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, రాములు నాయక్, మెచ్చ నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ తాత మధు, సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పీసీసీఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) దొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, కలెక్టర్ వీపీ గౌతమ్, కొత్తగూడెం ఎస్పీ వినీత్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, పోడుభూమి సాగుదారుల దాడిలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరణించిన ఎఫ్ ఆర్ వో కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో ఉంటే ఏవిధంగానైతే జీత భత్యాలు అందుతాయో.. ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని, రిటైర్ మెంట్ వయస్సువరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందజేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.