Uttam Kumar Reddy: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Telangana News : సీతారామ ప్రాజెక్టును ఈ నెల 15వ తేదీన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Telangana Minister Uttam Kumar Reddy: ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఏర్పాట్లపై బుధవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతులు మీదుగా పంద్రాగస్టు రోజున ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల కలలు సాకారమయ్యే రోజు వచ్చిందన్న ఉత్తమ్.. గత జూన్‌లో మొదటి పంపు హౌజ్ ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. రెండో పంపు హౌజ్ ట్రయల్ రన్‌ను ఈ నెల రెండో తేదీన విజయవంతంగా నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సుమారు తొమ్మిది లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని మంత్రి తెలిపారు. దశాబ్ధాల తన కల సాకారమవుతోందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతుల కష్టాలు ఇకపై తొలగనున్నాయన్న ఆనందాన్ని ఆయన వ్యక్తం చేశారు. రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూడడమే తన లక్ష్యమని వెల్లడించారు.
లక్ష ఎకరాలకు సాగు నీరు
ఇందిరా సాగర్, రాజీవ్ నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను ఒకే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌గా విలీనం చేసి భద్రాద్రి సీతారామ చంద్రస్వామి పేరు మీదుగా సీతారామ ఎత్తిపోతల పథకంగా ప్రభుత్వం పేరు మార్చింది. ఈ ప్రాజెక్టును స్వాతంత్ర దినోత్సవం రోజున గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురేశాక హెలికాఫ్టర్ ద్వారా నేరుగా ఖమ్మం జిల్లా వైరాకు సీఎం చేరుకుంటారని మంత్రి వెల్లడించారు. అక్కడే భజనం చేసి వైరాలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. అంతకుముందే సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్‌లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించిన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష మందితో సభను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సమీక్షా సమావేశంలో నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, డిప్యూటీ ఈఎన్‌సీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా, ఉంటే సభా స్థలాన్ని బుధవారం ఖమ్మం కలెక్టర్ ముజ్మమిల్ ఖాన్, ఖమ్మం సీపీ సునీల్ దత్ తదితరులతో కలిసి పరిశీలించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

