Minister KTR: ఎంపీపై కత్తి దాడి చేసింది కాంగ్రెస్ నేతనే - ఆధారాలు బయటపెట్టిన కేటీఆర్
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన సోమవారం మధ్యాహ్నం జరగ్గా అది రాజకీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో పొడిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా కేటీఆర్ బయట పెట్టారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని నిందితుడు స్పీచ్‌లు ఇస్తున్న ఫోటోలను కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన సోమవారం మధ్యాహ్నం జరగ్గా అది రాజకీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీని వెనుక ఏ పార్టీ లేదా ఏ వ్యక్తి ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ అంశం విపరీతంగా రాజకీయ నేతలు తమ ప్రచారంలో లేవనెత్తుతున్నారు. దాడిని అన్ని పార్టీలు ఖండించాయి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పైన కూడా ఆరోపణలు రాగా, తనకు ఏ సంబంధం లేదని ఆయన కొట్టిపారేశారు.
కాంగ్రెస్ కండువాతో ఫోటోలు
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ గూండానే అంటూ ఆ పార్టీ కండువా కప్పుకుని ఉన్న నిందితుడి ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఇంకా ఆధారాలు కావాలా అని మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
నిందితుడు మిరుదొడ్డి మండలం చేప్యాల గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. అతనికి దళిత బంధు, ఇంటి స్థలం కూడా రాకపోవడం వల్ల కోపం పెంచుకొని ఎంపీపై కక్ష కట్టారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉండడంతో తర్వాత చూద్దామని ఎంపీ చెప్పడంతో కోపం పెంచుకుని దాడికి తెగబడ్డాడని కూడా ప్రచారం సాగింది.
బీఆర్ఎస్ మాత్రం ఇది రాజకీయ దురుద్దేశంతోనే జరిగిందని ప్రచారం చేస్తోంది. సీఎం కేసీఆర్ కూడా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. ప్రతిపక్ష నేతలే ఈ పని చేయించి ఉంటారని అంటున్నారు. పోలీసులు కూడా రాజు ఎవరెవరితో ఫోన్ కాల్ మాట్లాడింది తెలుసుకునేందుకు కాల్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు చేప్యాలలో నిందితుడి తల్లిదండ్రుల్ని పోలీసులు ప్రశ్నించారు. ఆ గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు.
The Congress Goon who unleashed the murder attack on MP Prabhakar Reddy yesterday
— KTR (@KTRBRS) October 31, 2023
Do you need more proofs Rahul Gandhi ? pic.twitter.com/HceItfzvUL
కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి యశోద ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పలేమని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని.. ఐదు రోజుల పాటు ఇలాగే చికిత్స కొనసాగిస్తామని చెప్పారు. ప్రభాకర్ రెడ్డికి ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయని తెలిపారు.
ఇవాళ కూడా ఆస్పత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి బయట హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇలాంటి రాజకీయాలను రాయలసీమ, బిహార్‌లోనే చూశామని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి వాటికి అస్సలు తావు ఇవ్వబోరని అన్నారు. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని అపహాస్యం చేస్తున్నాయని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో పోలీసులు కుట్ర కోణాన్ని ఛేదిస్తారని ఆశిస్తున్నట్లుగా వెల్లడించారు.