Mancherial: కడుపులో దూది మర్చిపోయి కుట్లు - సిజేరియన్ డెలివరీ చేస్తుండగా డాక్టర్ల నిర్లక్ష్యం!
చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలింత ఆరోగ్యంగానే ఉందని, కొలుకుంటోందని వైద్యులు తెలిపారు.
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ బాలింత తీవ్ర ఇబ్బందులు పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తిలయ అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో గత ఐదు రోజుల కిందట కాన్పు కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. పురిటి నొప్పులతో ఆసుపత్రిలో ఆ మహిళకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఆపరేషన్ చేయగా పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చింది.
కాన్పు తర్వాత ఐదు రోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్న కీర్తిలయను డాక్టర్లు సోమవారం డిశ్చార్జి చేశారు. దీంతో ఆ బాలింత తన స్వగ్రామమైన వేమనపల్లి మండలంలోని నీల్వాయికి వెళ్లింది. అయితే, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమెకు కడుపునొప్పితో పాటు అస్వస్థతకు గురైంది. బాధితురాలి పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే 108 కి ఫోన్ చేసి చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. రాత్రి చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్లు కీర్తిలయను పరిశీలించి ఆపరేషన్ చేసి అందులోనే కాటన్ పాడ్ మర్చిపోయినట్టుగా గుర్తించారు.
ఆ డాక్టర్లు కాటన్ పాడ్ తొలగించారు. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలింత ఆరోగ్యంగానే ఉందని, కొలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేసి కాటన్ ప్యాడ్ మర్చిపోవడం ముమ్మాటికి డాక్టర్ల నిర్లక్ష్యమే అని, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, ఆదివాసీ నాయకులు కోరుతున్నారు.
ఇటీవలే ఇలాంటి మరో ఘటన
ఓ మహిళా డాక్టర్ చేసిన పొరపాటు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు డెలివరీ చేసి ఆ డాక్టర్ పేషెంట్ కడుపులోనే కత్తెర మరిచిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఎన్నో ఏళ్ల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాలకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం ఆరు సంవత్సరాల కిందట గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వచ్చింది. ప్రసవ సమయంలో ఆ డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. ఇన్నాళ్లూ ఈ ఘటన అస్సలు బయటికి రాలేదు.
ఇటీవల బాధితురాలైన మహిళకు కడుపు నొప్పి వచ్చింది. వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌కు వెళ్లి స్కానింగ్ చేయించుకోగా కడుపులో కత్తెర ఉన్న విషయం బయటికి వచ్చింది. దీంతో బాధితురాలు గోదావరిఖనికి వచ్చి తనకు డెలివరీ చేసిన డాక్టర్ ని నిలదీసింది. దీంతో ఇరువురూ మాట్లాడుకొని వివాదాన్ని పరిష్కరించుకున్నట్లు తెలిసింది. ఆపరేషన్ చేసి కడుపులో కత్తెరను తీసేందుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని మహిళా డాక్టర్ ఒప్పుకోవడంతో బాధిత కుటుంబ సభ్యులు శాంతించినట్లు సమాచారం.
ఏలూరులో కూడా
ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఆగస్టు మొదటి వారంలో వచ్చిన ఓ మహిళకు చికిత్స విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యాన్నే వైద్యులు చూపారు. ఓ మహిళ కాన్పు కోసం వచ్చింది. పరీక్షలు నిర్వహించిన ఓ సీనియర్ సివిల్ సర్జన్ ఆమెకు సిజేరియన్ చేసి పండంటి బిడ్డను బయటకు తీశారు. అప్పటి నుంచి ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతోంది. దీంతో వైద్యులు ఎక్స్ మరోసారి ఎక్స్ రే తీయించారు. కడుపులో కత్తెర ఉన్న విషయం గుర్తించి వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. అక్కడే పని చేసే ఓ ఉద్యోగి.. కడుపులో కత్తెర ఉన్న స్కానింగ్ ఫొటోను తన ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇలా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వెంటనే విషయం గుర్తించిన ఆస్పత్రి వర్గాలు ఆ ఉద్యోగిని పిలిచి మందలించడంతో ఆయన ఆ పోస్టును తొలగించాడు.